Begin typing your search above and press return to search.

క్రెడిట్ కార్డ్స్ ఉపయోగిస్తున్న వారికి షాకులిస్తున్న బ్యాంకులు!

By:  Tupaki Desk   |   22 April 2020 2:30 AM GMT
క్రెడిట్ కార్డ్స్ ఉపయోగిస్తున్న వారికి షాకులిస్తున్న బ్యాంకులు!
X
క్రెడిట్ కార్డు కస్టమర్లకు బ్యాంకులు షాకులు ఇస్తున్నాయి. ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ - కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటివి వాటి కస్టమర్ల క్రెడిట్ కార్డు లిమిట్‌‌ ను తగ్గించేసాయి. 30 నుంచి 90 శాతం మధ్యలో క్రెడిట్ కార్డు లిమిట్‌లో కోత విధించాయి. రీపేమెంట్ రిస్క్ తగ్గించుకోవడానికి బ్యాంకులు ఈవిధంగా చేస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా నెలకొన్ని లాక్ డౌన్ పరిస్థితుల వల్ల కొందరి ఉద్యోగాలకి గ్యారెంటీ లేకుండా పోయింది. అలాగే కొందరి వేతనాల్లో కోత వంటివి చోటుచేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో చాలా మంది క్రెడిట్ కార్డులనే నమ్ముకుంటారు. వీటితోనే ఎలాగైనా సమస్యల నుంచి గట్టెక్కాలని భావిస్తారు. అయితే ఇప్పుడు ఆలా ఊహించే వారికీ బ్యాంకులు షాకులిస్తున్నాయి. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. యాక్సిస్ బ్యాంక్‌ కు చెందిన దాదాపు 2 లక్షల మంది కస్టమర్ల క్రెడిట్ కార్డు లిమిట్స్‌‌ లో కోత పడింది. ఏప్రిల్ 15 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.

‘యాక్సిస్ బ్యాంక్ విస్తారా కార్డు క్రెడిట్ కార్డు లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.50,000కు తగ్గింది. క్రెడిట్ కార్డు బిల్లు సరైన టైమ్‌కే చెల్లిస్తూ వస్తున్నాను. ఇలా ఎందుకు జరిగిందో తెలీదు’ అని బ్యాంక్ కస్టమర్ ఒకరు తెలిపారు. ఆయన కస్టమర్ కేర్‌ కు కాల్ చేస్తే టెక్నికల్‌ ప్రాబ్లమ్ అన్నారని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారని తెలిపారు. అలాగే మరో కస్టమర్ కార్డు లిమిట్ కూడా రూ.7 లక్షల నుంచి రూ.1.5 లక్షలకు తగ్గించేశారు. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా పలు కస్టమర్ల క్రెడిట్ కార్డు లిమిట్‌లో కోత విధించింది. ‘నా క్రెడిట్ కార్డు లిమిట్ రూ.75,000 నుంచి రూ.44,000కు తగ్గింది. రెగ్యులర్ అకౌంట్ రివ్యూ‌లో భాగంగా లిమిట్ తగ్గించేశారు’ అని కోటక్ కార్డు కస్టమర్ ఒకరు తెలిపారు. అయితే , ఈ ప్రక్రియ ఎప్పుడూ జరిగేదేనని బ్యాంక్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.