Begin typing your search above and press return to search.

గందరగోళం: ఆర్బీఐ చెప్పినా ఈఎంఐలు చెల్లించాలని నోటీసులు

By:  Tupaki Desk   |   29 March 2020 1:00 PM GMT
గందరగోళం: ఆర్బీఐ చెప్పినా ఈఎంఐలు చెల్లించాలని నోటీసులు
X
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ గాడీ తప్పింది. కరోనా వైరస్‌ ప్రభావంతో వ్యాపార లావాదేవీలన్నీ తగ్గిపోయాయి. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో ప్రస్తుతం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి - కూలీ కరువైంది. మార్కెటింగ్‌ రంగం కుదేలైంది.. నిర్మాణం రంగం లావాదేవీలు ఆగిపోయాయి. ఉపాధి - ఉద్యోగం లేక ఇళ్లల్లో గడుపుతున్న ప్రజలు మాత్రం ఇప్పుడు ఇంటి అద్దె - అప్పులు - ఈఎంఐలపై పరేషాన్‌ అవుతోంది. ప్రభుత్వం పేదలను కరుణించినా మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. దీంతో వారు ఇప్పుడు వాటిని ఎలా చెల్లించాలనే విషయమై ఆందోళన చెందుతున్నారు. అయితే ఈఎంఐల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఈఎంఐలు ప్రస్తుతం మూడు నెలల పాటు వాయిదా వేసుకోవాలని ఏకంగా ఆర్బీఐ ప్రకటించింది. రుణాలు ఇచ్చే సంస్థలు ప్రజలు తీసుకున్న రుణాలకు ఈఎంఐలు లాక్‌ డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్బీఐ మారటోరియం విధించింది.

ప్రభుత్వ ఆదేశాలు ఆ విధంగా ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. రుణ వాయిదాలు - వాహనాల వాయిదాలు తదితర వాయిదాలు చెల్లించాలని ఆ సంస్థలు మాత్రం సందేశాలు పంపిస్తూనే ఉన్నాయి. బ్యాంక్‌ ఈఎంఐలు మూడు నెలల పాటు కట్టక్కర్లేదని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. అన్ని రకాల బ్యాంకుల నెల వాయిదాలపై ఆర్బీసీ మారటోరియం విధించింది. కమర్షియల్ - రీజనల్ - రూరల్ - నాన్‌ బ్యాంకింగ్ - ఫైనాన్స్‌ కంపెనీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మారటోరియం కాలంలో రుణ గ్రహీతల నుంచి ఈఎంఐలు బ్యాంక్‌ లు తీసుకోవు. ఆ విధంగా చేసినా వారి క్రెడిట్‌ స్కోర్‌ పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

అయితే కొన్ని రుణ సంస్థలు మాత్రం ఈఎంఐలు చెల్లించాల్సిందేనని వినియోగదారులకు సందేశాలు పంపుతున్నారు. ఆర్బీఐ ఆదేశాలు తమకు అందలేదని.. ఆలోపు ఈఎంఐల నగదు బ్యాంక్‌ ఖాతాలో ఉండేలా చూసుకోవాలని ఆ సంస్థలు నోటీసులు పంపుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకంటే పర్వాలేదు..కానీ ప్రైవేటు ఉద్యోగులు - లాక్‌ డౌన్‌ తో ఉపాధి కోల్పోయిన వారు ఎలా చెల్లిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. క్రెడిట్‌ కార్డు విషయంలో ప్రభుత్వ - ఆర్బీఐ స్పష్టత కరువైంది. ప్రభుత్వ మాటలు ఒకలా ఉంటే ఆర్థిక సంస్థల చర్యలు ఒకలా ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ప్రజలు గందరగోళంలో పడ్డారు. ఉపాధి.. జీతం లేని ప్రస్తుత లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో ఎలా చెల్లించేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్బీఐ ప్రకటించినట్టు కొన్నాళ్లు ఈఎంఐలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు.