Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియా గురించి ఒబామా

By:  Tupaki Desk   |   28 Dec 2017 3:51 PM GMT
సోష‌ల్ మీడియా గురించి ఒబామా
X
సోషల్ మీడియాను చూసి సంబరపడేవారు ఎందరున్నారో - చిరాకుపడుతున్నవారూ అంతేమంది ఉన్నారు. దీన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా అన్నట్లుగా ఉండడంతో దీనివల్ల సత్ఫలితాలు - దుష్ఫలితాలూ రెండూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా సోషల్ మీడియాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మార్పును ఆహ్వానించడంలో ముందుండే ఆయన సోషల్ మీడియా విషయంలో ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాను అత్యంత ప్రమాదకరమైనదిగా - సమాజాన్ని చీల్చేదిగా అభిప్రాయపడ్డారు.

అంతేకాదు... అధికార స్థానాల్లో ఉన్నవారు సోషల్ మీడియా వాడకం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ ప్రపంచానికి విలువైన సందేశం అందించారు. ‘‘మన భావాలను సోషల్‌ మీడియా ద్వారా వారిపై రుద్దితే అది ఒక రకంగా వారికున్న అభిప్రాయాల్ని ప్రభావితం చేసినట్లే. వారి పక్షపాతాలను బలోపేతం చేసే సమాచారాన్ని వారికి చేరవేసినట్లే.. ఇది సమాజ విచ్ఛిత్తికి దారితీస్తుంది’’ అని ఆయన అన్నారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన భావ ప్రచారానికి ట్విట్టర్‌ లాంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతుంటారు. ఈ నేపథ్యంలో ఒబామా కామెంట్లు ట్రంప్‌ పై వేసిన చురకలుగా పలువురు భావిస్తున్నారు.

అయితే... ఒబామా తన వ్యాఖ్యలను మరింత వివరంగా కూడా చెప్పారు. సోషల్‌ మీడియా చాలా అవకాశాలను కల్పిస్తుందని... వాటిని ఎలా వినియోగించుకుంటున్నామన్నదే ప్రధానమని ఆయన అన్నారు. ‘‘ఇంటర్నెట్‌ లో అన్నీ చూడ్డానికి ఈజీగానే అనిపిస్తాయి. దాన్నుంచి బయటకొచ్చి వ్యక్తులను ముఖాముఖి కలిసినపుడు అవే విషయాలు సంక్లిష్టంగా కనిపిస్తాయి’’ అని ఒబామా అన్నారు. ‘‘ఒక మార్పు సాధించడానికి యువతరాన్ని మనం రంగంలోకి దింపుతాం. వారి ద్వారా సామాజిక అంశాలపై ఒక అభిప్రాయం నిర్మించాలనుకుంటాం. కేవలం ఒక హ్యాష్‌ ట్యాగ్‌ ను పంపడం ద్వారా మార్పు రాదు అన్నది వారు గ్రహించేలా చేయాలి. నిజమైన చైతన్యం తేవాలంటే వాస్తవికంగా ఏదేనా చేయాలి.. అపుడే మార్పు సాధ్యం’’ అని విశ్లేషించారు. మొత్తానికి సోషల్ మీడియాపై ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా ఒబామా మాత్రం తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా - స్పష్టంగా చెప్పారు.