Begin typing your search above and press return to search.

‘ట్రంప్ సామాన్యుడు కాదు’

By:  Tupaki Desk   |   17 Jan 2017 5:14 AM GMT
‘ట్రంప్ సామాన్యుడు కాదు’
X
మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అమెరికా అధ్యక్ష పదవి నుంచి బరాక్ ఒబామా వైదొలిగి.. అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే సమయం దగ్గరకు వచ్చేసింది. మామూలుగా అయితే.. ఈ సమయంలో పాత అధ్యక్షుల వారికి వీడ్కోలు సభలు.. కొత్త అధ్యక్షుల వారికి స్వాగతాలు చెప్పేయటం.. తాము ఎన్నుకున్న కొత్త నాయకుడి పాలన కోసం ఆశగా.. ఆసక్తిగా ఎదురుచూడటం లాంటివి కనిపిస్తుంటాయి.

కానీ.. అమెరికాలో ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ట్రంప్ వ్యతిరేకులు అంతకంతకూ పెరుగుతున్నారు. ట్రంప్ ను తాము అధ్యక్షుడిగా చూడలేమంటూ వీధుల్లోకి వచ్చిన పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలువురు ప్రముఖులు తాము వెళ్లేది లేదని కుండబద్ధలు కొట్టేస్తున్నారు. చివరకు అవార్డుల ఫంక్షన్లలో తమకొచ్చిన అవార్డును అందుకుంటూనే.. ఆ సందర్భంగా మాట్లాడే అవకాశాన్ని ట్రంప్ ను తిట్టేందుకు ఉపయోగిస్తున్న వైనం.. గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదని చెబుతున్నారు.

ఇప్పటికి ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడంటే.. ఏదో జరిగిందన్న వాదనను వినిపిస్తున్న అమెరికన్లు బోలెడంత మంది కనిపిస్తున్నారు. ఇలాంటివేళ.. అధికార బదిలీ విషయంలో సగటు అమెరికన్ మాదిరే అధ్యక్షుల వారి మైండ్ సెట్ ఉందన్న విషయం ఆయన మాటలు స్పష్టంగా చెప్పేస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అధికార మార్పిడి అసాధారణంగా ఉందన్న విషయాన్ని చెప్పేస్తున్న ఒబామా.. ట్రంప్ తనకన్నా బాగా పాలించగలడని తాను ఎంతమాత్రం అనుకోవటం లేదని తేల్చేశారు.

అంతేకాదు.. ట్రంప్ పైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యల్ని చేశారు. అమెరికాకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. మార్పు తెచ్చే వ్యక్తి అని.. అతడ్ని తక్కువ అంచనా వేయద్దని వ్యాఖ్యానించారు. ‘‘అమెరికా ప్రజలే వాషింగ్టన్ ను మార్చగలరు. కానీ.. అలా అది జరగదు. ఎందుకంటే ఆ మార్పును కొందరు పెద్దలు నిర్దేశిస్తారు. ట్రంప్ కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. అయినా.. విజయవంతంగా ప్రచారం నిర్వహించాడు. ఆయన సామాన్యుడు కాదు’’అంటూ ట్రంప్ గురించి ఒబామా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/