Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఎఫెక్ట్..మన జీడీపీ గుండు సున్నా!

By:  Tupaki Desk   |   15 April 2020 1:30 AM GMT
లాక్ డౌన్ ఎఫెక్ట్..మన జీడీపీ గుండు సున్నా!
X
భారత స్థూల జాతీయోత్పత్తికి సంబంధించినంత వరకు ఈ వార్త నిజంగానే పెను సంచలనమనే చెప్పక తప్పదు. ఎందుకంటే... వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో అగ్రగామిగా ఉన్న భారత జీడీపీ ఈ ఏడాది (2020-21)లో ఎన్నడూ లేనంతగా సున్నాకు పడిపోనుందట. అది కూడా ప్రాణాంతక వైరస్ కరోనాపై సాగిస్తున్న పోరులో భాగంగా దేశవ్యాప్త లాక్ డౌన్ ను వరుసగా రెండు పర్యాయం పొడిగించిన ఫలితంగానే ఈ దుష్పరిణామం చోటుచేసుకోనుందట. ఇదేదో మోదీ సర్కారు అంటే గిట్టని వారు చెప్పిన మాట ఎంతమాత్రం కాదు. ఆయా దేశాల ఆర్థిక రంగాలపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తున్న బార్ క్లేస్ ఎమర్జింగ్ మార్కెట్స్ రీసెర్చీ పక్కాగా అంచనా వేసి చెప్పిన మాట.

భారత జీడీపీ సున్నాను టచ్ చేస్తుందన్న విషయం గతంలో మనమెప్పుడూ చూడనిది. విననది కూడానూ. అయితే బార్ క్లేస్ కూడా ఇలా ఓ దేశ జీడీపీ సున్నాకు పడిపోనుందని చెప్పిన మాట కూడా గతంలో ఎన్నడూ జరగలేదట. మొత్తంగా నెవర్ బిఫోర్ అన్న చందంగానే ఇటు బార్ క్లేస్ అంచనా - అటు భారత జీడీపీపీ సున్నాను తాకుతుందన్న అంచనా రెండూ గతంలతో ఎన్నడూ జరగనివే. అభివృద్ధిలో ఓ రేంజిలో దూసుకుపోతున్న భారత్ లాంటి దేశాల్లో లాక్ డౌన్ కారణంగా రోజుల తరబడి - వారాల తరబడి ఉత్పత్తి రంగం మూతపడిపోతే... జీడీపీ సున్నాను తాకక ఏం చేస్తుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

కరోనా మహమ్మారిని కట్టడి చేసే క్రమంలో గత నెల 25 నుంచి ఈ నెల 14 దాకా ఏకంగా 21 రోజుల పాటు యావత్తు దేశాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. సదరు లాక్ డౌన్ మంగళవారంతో ముగియనుంది. ఈ 21 రోజుల లాక్ డౌన్ కారణంగా భారత స్థూల జాతీయోత్పత్తి 2.5 శాతానికి పడిపోతుందని అంతకుముందు బార్ క్లేస్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే 21 రోజుల లాక్ డౌన్ తో కరోనా వ్యాప్తికి ఇంకా అడ్డుకట్ట పడకపోవడంతో లాక్ డౌన్ ను మరో 19 రోజుల పాటు అంటే... బుధవారం నుంచి వచ్చే నెల (మే నెల) 3 వరకు పొడిగిస్తున్నట్లుగా మంగళవారం ఉదయం మోదీ ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడినంతనే... భారత జీడీపీ సున్నాకు పడిపోయే అవకాశాలున్నాయంటూ బార్ క్లేస్ ఓ సంచలన నివేదికను విడుదల చేసింది.