Begin typing your search above and press return to search.

నవ్యాంధ్రలో బసవతారకం ఆసుపత్రి

By:  Tupaki Desk   |   28 Sep 2015 5:00 AM GMT
నవ్యాంధ్రలో బసవతారకం ఆసుపత్రి
X
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అపన్న హస్తం అందిస్తూ.. వారికి ఎనలేని సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తన సేవల్ని విస్తరించనుంది. ఇప్పటివరకూ హైదరాబాద్ లో మాత్రమే ఉన్న ఈ ఆసుపత్రిని ఇకపై ఏపీ రాజధానికి సమీపంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రయత్నాలు షురూ అయ్యాయని తెలుస్తోంది.

విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి తెలంగాణకు పరిమితం కావటం.. ఏపీ వాసులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సీమాంధ్ర రాజధానికి దగ్గర్లో నిర్మించటం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికను బసవతారకం ఆసుపత్రి వర్గాలు సిద్ధం చేశాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి ఎన్టీఆర్ కుమారుడు.. హిందూపురం ఎమ్మెల్యే.. ప్రముఖ నటుడు బాలయ్య నేతృత్వంలో నడుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలోనూ బసవతారకం ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందుకు తగినట్లుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ఆసుపత్రిని రూ.500కోట్లతో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 50 ఎకరాల విస్తీర్ణయంలో ప్రారంభమయ్యే ఈ ఆసుపత్రికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ఏపీ సర్కారు ఇప్పటికే సంసిద్ధత తెలియజేయటంతో పాటు.. భూమిని అప్పగించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.

గుంటూరు జిల్లా నల్లపాడు (గుంటూరు పట్టణానికి సమీపంలో ఉంది) లో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు.. ఎన్ ఆర్ ఐల సహాకారంతో.. స్వదేశంలోనే సమీకరించనున్నారు. ఈ ఆసుపత్రికి భారీగా విరాళాలు ఇచ్చేందుకు పలువురు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం కానీ పూర్తి అయితే.. సీమాంధ్రులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందనటంలో సందేహం లేదు.