Begin typing your search above and press return to search.

కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై నిర‌స‌న‌ల భ‌గ్గు

By:  Tupaki Desk   |   2 Dec 2017 9:32 AM GMT
కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై నిర‌స‌న‌ల భ‌గ్గు
X
ఏపీ రాష్ట్రంలో భిన్న‌మైన వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. కాపుల్ని బీసీలుగా గుర్తిస్తూ రిజర్వేష‌న్లు ఇవ్వాల‌న్న డిమాండ్‌పై ఏపీ స‌ర్కారు సానుకూలంగా స్పందించి.. బిల్లును అసెంబ్లీలో పాస్ చేశారు. ఈ ఆనందంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మొద‌లు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల‌తో స‌హా అంద‌రూ కేకులు క‌ట్ చేసుకుంటూ.. స్వీట్లు పంచుకుంటూ పండ‌గ చేసుకుంటున్నారు.

ఈ సంబ‌రాల వాతావ‌ర‌ణం ఒక‌ప‌క్క సాగుతుంటే.. మ‌రోవైపు కాపుల్ని బీసీల్లోకి చేరుస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయ‌టంపై బీసీ సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాల్లో నిర‌స‌న‌లు భ‌గ్గుమంటున్నాయి. తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ‌లోని క‌లెక్ట‌రేట్ ఎదుట సీఎం చంద్ర‌బాబు దిష్టిబొమ్మ‌ను ద‌గ్థం చేశారు.

కాపుల్ని బీసీల్లోకి చేరుస్తూ బిల్లు అసెంబ్లీలో పాస్ చేయ‌టం వ‌ల్ల త‌మ ప్ర‌యోజ‌నాలు దెబ్బ తింటాయన్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న వారు టైర్ల‌కు నిప్పు అంటించి రోడ్ల మీద‌కు వేశారు. దీంతో క‌లెక్ట‌రేట్‌కు వెళ్లే ర‌వాణా స్తంభించింది.

మ‌రోవైపు ఆగిన వాహ‌నాల గాలి తీసేయ‌టంతో రోడ్ల మీద వాహ‌నాలు నిలిచిపోయాయి. దీంతో.. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే.. తిరుప‌తిలోనూ కాపుల‌ను బీసీల్లోకి చేరుస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు పాస్ కావ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ రోజు మెరుపు ముట్ట‌డి కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. క‌లెక్ట‌రేట్ ముట్ట‌డి కార్య‌క్ర‌మాన్ని భారీగా నిర్వ‌హించాయి. ఇందులో బీసీ నేత‌లు భారీగా హాజ‌రుకావ‌టం గ‌మ‌నార్హం.

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌టంతో పాటు.. చంద్ర‌బాబు.. బీసీ మంత్రుల దిష్టిబొమ్మ‌ల్ని ద‌గ్థం చేశారు. బీసీల‌కు అన్యాయం చేశారంటూ మండిప‌డుతున్నారు. బీసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ నివేదిక ఇవ్వ‌కుండా స‌భ్యుల రిపోర్ట్‌ ను ఎలా ఆమోదిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో మైనార్టీల విష‌యంలోనూ ఇదే తీరుతో వ్య‌వ‌హ‌రించారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వారు జ‌స్టిస్ మంజునాథ ఇచ్చిన నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. మ‌రికొన్ని జిల్లాల్లోనూ ఏపీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్ని నిర్వ‌హిస్తున్నారు.