Begin typing your search above and press return to search.

గ్రేటర్ లో బీసీలకు ఎవరెన్ని సీట్లు..?

By:  Tupaki Desk   |   23 Jan 2016 4:44 AM GMT
గ్రేటర్ లో బీసీలకు ఎవరెన్ని సీట్లు..?
X
గ్రేటర్ ఎన్నికల్లో బీసీల కరుణ కోసం పార్టీలు కొత్త కసరత్తు చేస్తున్నాయి. బీసీల ఓట్లే గ్రేటర్ అధికారపక్షాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉండటంతో వారి మనసు దోచుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. ఆరు సర్కిళ్ల పరిధిలోని దాదాపు 60 నుంచి 70 స్థానాల ఫలితాల్ని బీసీలే డిసైడ్ చేయనున్న నేపథ్యంలో పార్టీలు వారి ఓట్లను దండుకోవటానికి ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 74.23లక్షల ఓట్లలో.. 18లక్షలకు పైగా ఓట్లు బీసీలకు ఉండటం గమనార్హం. కాస్త అటూ ఇటూగా పాతిక శాతం ఓట్లున్న బీసీలు.. కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ ఓట్లు ఉండటం గమనార్హం.

గ్రేటర్ మీద ఎవరి జెండా ఎగరాలన్నా బీసీలు ఓటేస్తే కానీ.. అధికారం చేజిక్కించుకోవటం సాధ్యం కాదు. అందుకే.. తాము కేటాయించిన సీట్లలో బీసీలకు పెద్దపీట వేస్తూ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. కొన్ని పార్టీలు భారీగా సీట్లు కేటాయిస్తే.. మరికొన్ని పార్టీలు పెద్దగా ఇవ్వలేదు. పార్టీల వారీగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలు చూస్తే.. టీడీపీ బీసీలను విపరీతంగా నమ్మినట్లు కనిపిస్తుంది. తర్వాతి స్థానంలోతెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ నిలుస్తుంది.

పార్టీల వారీగా బీసీలకు కేటాయించిన సీట్లు చూస్తే..

గ్రేటర్ బరిలో 87 స్థానాల్లో పోటీ చేస్తున్నతెలుగుదేశం పార్టీ బీసీలకు 53 సీట్లు ఇవ్వటం చూస్తే.. బీసీల హవా ఎంత ఉందో ఇట్టే తెలుస్తుంది. తాను పోటీ చేస్తున్న మొత్తం సీట్లలో దాదాపు 60 శాతానికిపైగా సీట్లు బీసీలకు కేటాయిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణ అధికారపక్షం మాత్రం బీసీల మీద కాస్త తక్కువ సీట్లనే కేటాయించింది.

మొత్తం ఆ పార్టీ 147 స్థానాల్లో పోటీ చేస్తుంటే.. 69 సీట్లలో బీసీలకు టిక్కెట్లు ఇచ్చింది. అంటే.. 46 శాతమన్న మాట. తెలుగుదేశంతో పోలిస్తే.. టీఆర్ ఎస్ బీసీలకు తక్కువ సీట్లు కేటాయించిందనే చెప్పాలి. ఇక.. బీజేపీ తాను బరిలోకి దిగుతున్న 40స్థానాల్లో 13 సీట్లను బీసీలకు కేటాయించింది. ఇక.. అందరి కంటే తక్కువగా కాంగ్రెస్ బీసీలకు టిక్కెట్లు ఇచ్చింది. మొత్తం 124 స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ కేవలం 25 సీట్లల్లో మాత్రమే బీసీలకు టిక్కెట్లను కేటాయించింది. అంటే.. 20 శాతం కంటే తక్కువ కేటాయింపులన్న మాట. మరి.. తమ మీద ఆశలు పెట్టుకున్న పార్టీల విషయంలో బీసీలు ఎవరు వైపు మొగ్గుతారో చూడాలి.