Begin typing your search above and press return to search.

తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు

By:  Tupaki Desk   |   1 April 2022 6:30 AM GMT
తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు
X
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఈనెల 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులను నిర్వహించబోతున్నది. అంతకన్నా ముందు పార్టీలోని బీసీ సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసలు, సర్పంచులతో కూడా భేటీలు నిర్వహించాలని డిసైడ్ చేశారు.

గడచిన మూడేళ్ళుగా బీసీలకు ప్రభుత్వం చేసిన మేళ్ళు, చేయబోయే కార్యక్రమాలను సవివరంగా వివరించబోతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. ముందు పార్టీలోని నేతలతో ఈనెల 15వ తేదీలోగా సదస్సులు నిర్వహిస్తారు. ఆ తర్వాత మొత్తం సామాజికవర్గాలను కలుపుతు సదస్సులు నిర్వహిస్తారు. మే రెండో వారంలోగా సామాజికవర్గంలోని నేతలు, వివిధ పథకాల్లోని లబ్దిదారులందరినీ కలవబోతున్నారు.

రెండో విడత సదస్సులను కూడా మే రెండో వారంలోగా ముగించాలని పార్టీ డిసైడ్ అయ్యింది. ఆ తర్వాత అందరినీ కలుపుతు రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించేందుకు పెద్ద ప్లాన్ వేస్తున్నది పార్టీ. దీనికి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు.

పార్టీలోని నేతలతో సమావేశాలు పెట్టుకున్నా, సామాజికవర్గంలోని నేతలు, లబ్దిదారులతో సదస్సులు నిర్వహించినా అంతమ ధ్యేయం మాత్రం రాజకీయ లబ్ది పొందటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఇటు వైసీపీకి అటు టీడీపీకి చాలా కీలకమని అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే బీసీల ఓటు బ్యాంకు చాలా కీలకంగా ఉండబోతోంది. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో సగానికి పైగా బీసీలే ఉన్నారు.

అందుకనే ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే బీసీల మద్దతు చాలా అవసరం. కాపులతో కలిసి మిగిలిన అన్నీ సామాజిక వర్గాలు కలిపినా బీసీలంత లేరు. అందుకనే జగన్ దృష్టి ఈసారి బీసీ సామాజిక వర్గాల పైన ఎక్కువగా నిలిచింది.