Begin typing your search above and press return to search.

టీడీపీ బీసీ వ్య‌తిరేక పార్టీ.. కృష్ణ‌య్య కామెంట్‌.. నిప్పులు చెరిగిన నెటిజ‌న్లు

By:  Tupaki Desk   |   29 May 2022 2:46 PM GMT
టీడీపీ బీసీ వ్య‌తిరేక పార్టీ.. కృష్ణ‌య్య కామెంట్‌.. నిప్పులు చెరిగిన నెటిజ‌న్లు
X
తాజాగా ఏపీ అధికార పార్టీ వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు టికెట్ సంపాయించుకున్న బీసీ ఉద్య‌మ నేత ఆర్ కృష్ణ‌య్య‌.. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డుతున్నార‌ని.. నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. త‌న‌కు రాజ్య‌స‌భ టికెట్ ఇచ్చిన వైసీపీ అధినేత , ఏపీ సీఎం జ‌గ‌న్‌పై మాత్రం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.. సీఎం జగన్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోమోగుతోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సామాజిక న్యాయం ఏపీలో జరుగుతోందన్నారు. టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ. చంద్రబాబు మాటల్లోనే బీసీలపై ప్రేమ చూపించారని చెప్పారు.

బీసీలపై ప్రేమను సీఎం జగన్‌ చేతల్లో చూపుతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం జగన్‌ పాలన చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు. అంతేకాదు.. టీడీపీ బీసీల‌కు ఏమీ చేయ‌లేద‌ని కృష్ణ‌య్య దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కృష్ణ‌య్య మాట్లాడారు.

చంద్రబాబు పాలనలో టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని.. వైఎస్‌ జగన్ పాలనలో కులాలు, పార్టీ లకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు. మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. "సీఎం జగన్‌ను ఎందుకు క్విట్ చేయాలి?. అమ్మ ఒడి ఇస్తున్నందుకా?. రైతు భరోసా ఇస్తున్నందుకా?. వైఎస్సార్ చేయూత ఇస్తున్నందుకా?" అని కృష్ణ‌య్య‌ ప్రశ్నించారు. జగనన్న ముద్దు.. చంద్రబాబు వద్దు అన్న నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. చరిత్రలో లేని విధంగా బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సీఎం జగన్‌ పాలన చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ పాలనలోనే అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారని కృష్ణ‌య్య‌ అన్నారు. "టీడీపీది మహానాడు కాదు.. వెన్నుపోటు నాడు, దగా నాడు. టీడీపీది జరిపింది నయవంచక మహానాడు" అంటూ దుయ్యబట్టారు. నవరత్నాల పథకాలతో సీఎం జగన్‌.. పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కలేనన్నారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

అణగారిన వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని చెప్పారు. కేబినెట్‌లో 74 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అవకాశం కల్పించారన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేశారన్నారు. అయితే.. కృష్ణ‌య్య వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మండి ప‌డుతున్నారు. "అయ్యా మ‌రి ఏ మొహం పెట్టుకుని 2014లో చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నారు? అప్ప‌ట్లో మిమ్మ‌ల్ని సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన విష‌యాన్ని మ‌రిచిపోయారా?" అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా.. కృష్ణ‌య్య తిన్నింటి వాసాలు లెక్క‌పెట్ట‌డంలో ఆరితేరి పోయాడ‌ని అంటున్నారు.