Begin typing your search above and press return to search.

బాబు నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు

By:  Tupaki Desk   |   1 Dec 2017 4:20 PM GMT
బాబు నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు
X
చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలైంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గంలో నిర్ణయించిన నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేయే ఆయనపై తిరుగుబాటు చేస్తున్నారు. కాపు - తెల‌గ - బ‌లిజ‌ - ఒంటరి కులాల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివర్గం నిర్ణయించడంతో... ఆ పార్టీ ఎమ్మెల్యే, బీసీ సంఘం జాతీయాధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని అడ్డుకుని తీరాలంటూ బీసీలకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు ప్ర‌భుత్వం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఈ నిర్ణ‌యం తీసుకుని, బీసీల అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయన ఆరోపించారు. బీసీలకు విలువ లేకుండా పోతుందని... ఇప్పటికీ చాలా మంది బీసీల‌కు ఉద్యోగాలు దొర‌క‌డం లేదని ఆయన అన్నారు. ఏపీ కేబినేట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని అమ‌ల్లోకి తెస్తే నిజ‌మైన‌ బీసీల్లో ఒక్క‌రికి కూడా ఉద్యోగం రాదని ఆర్.కృష్ణ‌య్య‌ అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీసీ నాయ‌కులు ఉద్య‌మాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా స్పందించి తాము తీసుకోవాలనుకుంటోన్న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలని కోరారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు గ‌ట్టిగా దీన్ని వ్య‌తిరేకించాలని పిలుపునిచ్చారు.

కాగా టీడీపీ నుంచి తెలంగాణలో గెలిచిన ఆర్.కృష్ణయ్య చాలాకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా సొంతంగానే బీసీ పోరాటాలు చేస్తున్నారు. ఇప్పుడాయన పూర్తిస్థాయిలో చంద్రబాబుపై పోరాటానికి దిగనున్నట్లు తెలుస్తోంది.