Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ ను న‌మ్మ‌ని బీసీ నేత‌లు..!

By:  Tupaki Desk   |   10 Feb 2022 5:09 AM GMT
టీ కాంగ్రెస్ ను న‌మ్మ‌ని బీసీ నేత‌లు..!
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బీసీ నేత‌లు న‌మ్మ‌డం లేదా..? పార్టీ పెద్ద‌లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నా ఆ వ‌ర్గం నేత‌లు మాత్రం దూరంగా ఉంటున్నారా..? ఆ వ‌ర్గంలోని కొంద‌రు నేత‌లు పార్టీకి దూర‌మైనా.. మ‌రికొంద‌రు పార్టీలోకి వ‌చ్చేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసినా.. చేర‌క‌పోవ‌డానికి ఆ డైలామానే కార‌ణ‌మా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని బీసీ నేత‌లు ఏనాడూ న‌మ్మ‌లేదు.

నంద‌మూరి తార‌క‌రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో చైత‌న్యం వ‌చ్చింది. చాలా మంది యువ‌కులు.. డాక్ట‌ర్లు, లాయ‌ర్లు, విద్యార్థులు.. ప‌లు సామాజిక రంగంలో ప‌ని చేస్తున్న ఎంద‌రో పోలోమంటూ టీడీపీలో చేరారు. ఇందులో ఎక్కువ భాగం బీసీ నేత‌లే ఉన్నారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ నుంచి కూడా టీడీపీ లోకి వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయి. ఇందులో కూడా బీసీలే ఎక్కువ‌గా ఉన్నారు.

టీడీపీ అంటేనే బీసీ పార్టీ అనే విధంగా మార్చారు ఎన్టీఆర్‌. త‌ర్వాత చంద్ర‌బాబు కూడా అదే కొన‌సాగించారు. తెలంగాణ‌లో దేవేంద‌ర్ గౌడ్‌, ఏపీలో క‌ళా వెంక‌ట‌రావు వంటి నేత‌లు బీసీల‌కు ఐకాన్ లుగా మార‌డానికి టీడీపీనే కార‌ణం. ఇంకా ఇత‌ర ముఖ్య బీసీ నేత‌లు కూడా టీడీపీ నీడ‌లో ఎదిగారు. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో చాలా మంది బీసీ నేత‌లు టీఆర్ఎస్ లో చేరారు. మ‌రికొంద‌రు బీజేపీలో.. కొంద‌రు స్త‌బ్ధంగా ఉండిపోయారు. కానీ కాంగ్రెస్ లో చేరింది మాత్ర‌మే స్వ‌ల్ప‌మే.

రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన‌పుడు కూడా పేరున్న బీసీ నేత‌లు ఎవ‌రూ ఆయ‌న వెంట రాలేదు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత త‌న పంథా మార్చుకున్నారు. అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకు పోయే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఘ‌ర్ వాపసీ కార్య‌క్ర‌మానికి కూడా శ్రీ‌కారం చుట్టారు. పాత టీడీపీ బీసీ నేత‌ల‌పై కూడా గురిపెట్టారు. అయినా.. ఆ వ‌ర్గం నేత‌లు చాలా మంది మౌనంగా ఉన్నారు. రేవంత్ తొలుత దేవేంద‌ర్ గౌడ్‌, ఆయ‌న కుమారుడు వీరేంద‌ర్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. వారు బీజేపీకే మ‌ద్ద‌తు తెలిపారు కానీ కాంగ్రెలో చేర‌లేదు. త‌ర్వాత కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీ‌శైలం గౌడ్ బీజేపీలో చేరారు.

కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్‌ ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ ను, ఆయ‌న కుమారుడిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. అప్పుడు.. ఇప్పుడు అంటూ వాయిదా వేస్తున్నారే త‌ప్ప పార్టీలో చేర‌డం లేదు.

జ‌డ్చ‌ర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్ కూడా తొలుత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా ఇపుడు సైలెంట్ గా ఉన్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ లోనే ఉన్న సీనియ‌ర్ నేత వీహెచ్ కూడా త‌న‌కు స‌రైన ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నారు. ఇలా చాలా మంది బీసీ నేత‌లు ఆ పార్టీని న‌మ్మ‌డం లేదు. ఇప్ప‌టికే పార్టీలో త‌మ‌కు స‌రైన ప్ర‌యారిటీ లేద‌ని బాధ‌ప‌డుతున్న మ‌రో వ‌ర్గం నేత‌ల‌కు తోడు బీసీలు కూడా దూర‌మైతే కాంగ్రెస్ కు భ‌విష్య‌త్తులో గ‌డ్డుకాల‌మే. రేవంత్ ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారో.. పార్టీలో సామాజిక న్యాయం ఎలా తీసుకొస్తారో వేచి చూడాలి.