Begin typing your search above and press return to search.

దినేష్‌ కార్తీక్‌ క్షమాపణకు బీసీసీఐ స్పందన

By:  Tupaki Desk   |   17 Sept 2019 10:08 AM IST
దినేష్‌ కార్తీక్‌ క్షమాపణకు బీసీసీఐ స్పందన
X
టీం ఇండియా స్టార్‌ ప్లేయర్‌ దినేష్‌ కార్తీక్‌ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం వెస్టిండీస్‌ లో జరిగిన కరేబియన్‌ లీగ్‌ మ్యాచ్‌ లను చూసేందుకు బీసీసీఐ అనుమతి లేకుండా వెళ్లాడు. అదే సమయంలో షారుఖ్‌ ఖాన్‌ జట్టు అయిన ట్రిన్‌ బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఆ జట్టు జెర్సీని వేసుకుని డ్రస్సింగ్‌ రూంలో ఉండి మ్యాచ్‌ ను చూడటం జరిగింది. ఆ విషయమై బీసీసీఐ సీరియస్‌ అవ్వడం.. బీసీసీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించావంటూ దినేష్‌ కార్తీక్‌ కు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం స్పీడ్‌ గా జరిగి పోయింది.

బీసీసీఐ షోకాజ్‌ నోటీసుకు స్పందించిన దినేష్‌ కార్తీక్‌ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ఇలాంటివి మరోసారి రిపీట్‌ కాకుండా చూసుకుంటానంటూ హామీ ఇచ్చాడు. బీసీసీఐ రూల్స్‌ ను బ్రేక్‌ చేయడం తన ఉద్దేశ్యం కాదని.. అవగాహణ రాహిత్యం కారణంగానే తప్పు జరిగిందంటూ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొని క్షమాపణలు చెప్పడం జరిగింది. మెకల్లమ్‌ ఆహ్వానం మేరకు తాను వెళ్లానని ఆయన కోరిక మేరకు జర్సీ వేసుకోవాల్సి వచ్చిందని దినేష్‌ కార్తీక్‌ వివరణ ఇచ్చాడు.

దినేష్‌ కార్తీక్‌ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన బిసీసీఐ క్రమశిక్షణ సంఘం సభ్యులు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని తీర్మానించారు. బోర్డు పంపిన షోకాజు నోటీసులకు వెంటనే స్పందించి క్షమాపణ చెప్పినందుకు గాను దినేష్‌ కార్తీక్‌ ను మన్నించడం జరిగిందని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇకపై దీని గురించి ఎలాంటి చర్చ.. వివరణలు అక్కర్లేదు ఉండవు అంటూ బీసీసీఐ అధికారిక ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. బీసీసీఐ మన్నించడంతో దినేష్‌ కార్తీక్‌ ఊపిరి పీల్చుకున్నాడు.