Begin typing your search above and press return to search.

టీమ్ ఇండియా కోచ్.. సరికొత్త ఆలోచన

By:  Tupaki Desk   |   21 Aug 2015 5:49 AM GMT
టీమ్ ఇండియా కోచ్.. సరికొత్త ఆలోచన
X
ఐదు నెలలు దాటిపోయింది.. టీమ్ ఇండియా కోచ్ పదవి ఖాళీ అయి. నాలుగేళ్లు ఈ పదవిలో ఉండి అనేక వైఫల్యాలు మూటగట్టుకున్న డంకన్ ఫ్లెచర్ ప్రపంచకప్ తర్వాత నిష్క్రమించాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా మూడో సిరీస్ ఆడుతోంది. ఏడాదిగా టీమ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రవిశాస్త్రి పెద్దగా జట్టుతో ఉంటున్నది లేదు. సహాయ కోచ్ లు ముగ్గురితోనే ఎలాగోలా బండి లాగించేస్తున్నారు. ఐతే బంగ్లాదేశ్, జింబాబ్వే చిన్న జట్లు కాబట్టి కోచ్ అవసరం లేదనుకోవచ్చు. కానీ ఇప్పుడు శ్రీలంక లాంటి పెద్ద జట్టుతో కీలకమైన టెస్టు సిరీస్ కు కూడా కోచ్ లేకుండానే బండి లాగించేస్తున్నారు. ఐతే అక్టోబరులో దక్షిణాఫ్రికా సిరీస్ సమయానికి మాత్రం కోచ్ పదవిని ఫిల్ చేసేయాలనే ఆలోచనలో ఉంది బీసీసీఐ.

కోచ్ ఎంపిక బాధ్యత సచిన్, గంగూలీ లక్ష్మణ్ లతో కూడిని క్రికెట్ కమిటీకి అప్పగించింది బోర్డు. వాళ్లు ముగ్గురు నెల రోజుల నుంచి కసరత్తు చేశారు. గత ఏడాది కాలంలో రిటైరైన ముగ్గురు ప్రముఖ క్రికెటర్లతో పాటు మొత్తం ఆరుగురిని కోచ్ పదవికి పరిశీలించినట్లు సమాచారం. కానీ ఎవరి విషయంలోనూ తుది నిర్ణయానికి రాలేకపోతున్నారట. వాళ్లందరికీ టీ20 కమిట్ మెంట్లుండటం వల్ల పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవడానికి మొగ్గు చూపట్లేదట. అంతే కాక విదేశీ కోచ్ లు తమకు సహాయకులుగా విదేశీయుల్నే పెట్టుకోవడానికి ఇష్టపడుతుండగా.. బీసీసీఐ మాత్రం ప్రస్తుతమున్న భారతీయ సహాయ కోచ్ లనే కొనసాగించాలని భావిస్తోందట. ఈ రెండు కారణాల వల్ల ఓ పూర్తి స్థాయి కోచ్ ను నియమించడం కష్టమవుతోంది. దీంతో బీసీసీఐ ఇప్పుడో సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. టెస్టులకు, పరిమిత ఓవర్ల క్రికెట్ కు వేర్వేరుగా కోచ్ లను నియమించాలని భావిస్తోందట. టెస్టుల వరకు టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రినే కోచ్ గా కొనసాగించి.. ఓ కొత్త వ్యక్తిని వన్డేలు, టీ20లకు కోచ్ గా నియమించాలని భావిస్తోందట. దీని వల్ల నిరంతరం ఒకే కోచ్ జట్టుతో ఉండాల్సిన అవసరముండదని భావిస్తున్నారు. ఐతే వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించడం చూశాం కానీ.. వేర్వేరు కోచ్ ల మాట మాత్రం చాలా కొత్తగా ఉంది. ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాల్నిస్తుందో చూడాలి.