Begin typing your search above and press return to search.

500కి అంతా ఆహ్వానితులే.. ఆ ఒక్కడూ తప్ప!

By:  Tupaki Desk   |   16 Sep 2016 6:19 AM GMT
500కి అంతా ఆహ్వానితులే.. ఆ ఒక్కడూ తప్ప!
X
సంప్రదాయ క్రికెట్‌ లో 500వ టెస్టుకు భారత్ సిద్ధమైంది. న్యూజిలాండ్‌ తో ఈ నెల 22న కాన్పూర్‌ లో మొదలయ్యే తొలి టెస్టు భారత్‌ కు 500వ మ్యాచ్‌ కావడంతో.. ఈ చారిత్రాత్మక సంఘటనను - సందర్భాన్ని ఒక వేడుకలా నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది.. భారీ ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌ కు 500వ టెస్టు మ్యాచ్ కావడంతో దీనికి ఓ ప్రత్యేకతను కల్పించాలనే ఉద్దేశంతో స్వయంగా రంగంలోకి దిగిన బీసీసీఐ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టీం ఇండియా మాజీ కెప్టెన్లందరినీ బీసీసీఐ ఆహ్వానించనుంది. అయితే ఈ విషయంలో అందరినీ ఆహ్వానించిన బీసీసీఐ... మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ని మాత్రం ఆహ్వానించలేదు.

ఈ చారిత్రక మ్యాచ్‌ సమయంలో బీసీసీఐ భారత జట్టు మాజీ కెప్టెన్లు అందరినీ ఆహ్వానించాలని నిర్ణయించడం, అనంతరం సన్మానించాలని భావిస్తుండగా.. భారత్‌ కు ఘనమైన విజయాలు అందించిన మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌ ను మాత్రం ఈ వేడుకలకు పిలవడం లేదు. అయితే.. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో కోర్టు అజహర్‌ ను నిర్దోషి అని ప్రకటించినా కూడా ఇంకా బీసీసీఐ మాత్రం వివక్ష చూపుతుండటం పలు విమర్శలకు దారి తీస్తోంది. గతంలో చాలా మంది బోర్డుకు వ్యతిరేకంగా ప్రవర్తించినా కూడా తర్వాతి కాలంలో క్షమించి అక్కున చేర్చుకున్న బీసీసీఐ.. ఒక్క అజహరుద్దీన్ విషయంలోనే ఇలా ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ చారిత్రక మ్యాచ్‌ కు ఆతిథ్యం ఇచ్చే గ్రీన్‌ పార్క్‌.. భారత్‌ లో తొలి నాలుగు టెస్టు మైదానాల్లో ఒకటి కావడంతో... ఇక్కడే మాజీ కెప్టెన్లను గౌరవించేందుకు అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయని తెలుస్తోంది. నారీ కాంట్రాక్టర్‌ మొదలు ఇప్పటివరకూ కెప్టెన్లుగా వ్యవహరించిన, రికార్డులు నెలకొల్పిన అందరూ ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా ఈ టెస్ట్ మ్యాచ్‌ లో టాస్ కోసం ఉపయోగించేందుకు ప్రత్యేకంగా ఓ వెండి నాణాన్ని కూడా రూపొందించింది. ఆ వెండి నాణంపై '500వ టెస్టు' అని ముద్రించనుంది.