Begin typing your search above and press return to search.

మనలో మన మాట.. టీమిండియా సభ్యులకు స్మార్ట్ ఫోన్లు ఉండవా?

By:  Tupaki Desk   |   8 Aug 2022 7:36 AM GMT
మనలో మన మాట.. టీమిండియా సభ్యులకు స్మార్ట్ ఫోన్లు ఉండవా?
X
లండన్ లో జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో భారత క్రీడాకారులు పెద్ద ఎత్తున తమ ప్రతిభాపాటవాల్ని చూపిస్తూ.. పతకాల వర్షాన్ని కురిపిస్తున్నారు. మెరుపులు మెరిపిస్తున్న క్రీడాకారుల తీరుతో నూరుకోట్లకు పైబడిన భారత్ వారిని చూసి మురిసిపోతోంది. గతంతో పోలిస్తే.. ఈసారి మరిన్ని పతకాల్ని సొంతం చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలైనా.. రజతపతకాన్ని సొంతం చేసుకుంది. కామన్వెల్త్ పోటీల్లో తొలిసారి క్రికెట్ ను చేర్చటం తెలిసిందే.

ఈ టోర్నీ మొదట్నించి ఫైనల్ వరకు అమ్మాయిల క్రికెట్ జట్టు తమ సత్తా చాటటమే కాదు.. స్వర్ణాన్ని సొంతం చేసుకుంటుందన్న ఆశల్ని కల్పించింది. ఫైనల్ మ్యాచ్ నువ్వానేనా అన్నట్లుగా సాగింది. చివర్లో మ్యాచ్ మిస్ అయిన పరిస్థితి. ఈ ఫైనల్ పోరు చివర్లో ఆసక్తికరంగా మారి.. ఉత్కంఠను రేపింది. దీంతో.. మెన్స్ సీనియర్ జట్టు సైతం మహిళల ఫైనల్ మ్యాచ్ ను టెన్షన్ తో వీక్షించినట్లుగా పేర్కొంటూ బీసీసీఐ ఒక ఫోటోను విడుదల చేసింది.

అందులో టీమిండియా రోహిత్ ఫోన్ పట్టుకొని మ్యాచ్ చూస్తుంటే.. మిగిలిన వారు చుట్టూ గుమిగూడి మరీ మ్యాచ్ ను తిలకించిన వైనం ఉంది. ఫోటోలో అందరూ ఎంతో ఆసక్తిగా.. ఫలితం మీద ఉత్కంటతో చూస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఈ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన బీసీసీఐ.. ‘కామన్వెల్త్ లో మహిళా ఫైనల్. ఎడ్జ్ బాస్టన్ లో ఉత్కంట. ఫైనల్ మ్యాచ్ ను సీనియర్ మెన్స్ టీమ్ ఫాలో అవుతోంది ఇలా’ అన్న అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టి విడుదల చేశారు. 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు.. 19.3 ఓవర్ల 152 పరుగులకు అలౌట్ అయ్యింది.

14 ఓవర్ల వరకు 112/2 వికెట్లతో పటిష్ట స్థితిలో ఉన్న జట్టు.. తర్వాత వరుస పెట్టి వికెట్లు కోల్పోవటంతో ఓటమిపాలు కావాల్సి వచ్చింది. చివరి వరకు పోరాట పటిమ చూపినా వికెట్లు త్వరగా పడిపోవటంతో స్వర్ణం మిస్ అయ్యిందని చెప్పాలి. బీసీసీఐ షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. అందరిని ఆకర్షిస్తోంది.

అయితే.. రోహిత్ దగ్గర తప్పించి మిగిలిన వారి వద్ద స్మార్టు ఫోన్లు లేవా? ఒక ఫోన్ చుట్టూనే అంత మంది చూడాలా? టీమిండియాలాంటి జట్టు ఉందంటే.. అక్కడ టీవీ సౌకర్యం కనీసం ఉంటుంది కదా?కానీ.. అదేమీలేకుండా ఒక ఫోన్ చుట్టూ మిగిలిన జట్టు సభ్యులంత చూడటం కాస్త తేడా కొడుతున్నా.. అధికారికంగా పోస్టు చేశారు కాబట్టి ఫోటోను నమ్మాల్సిందే అన్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని ఇలా ఉంచితే.. భారత మహిళా క్రికెట్ జట్టుకు మాత్రం అభినందనలు తెలియజేయాల్సిందే.