Begin typing your search above and press return to search.

రాజీవ్ ఖేల్ ర‌త్నః ఆ ఇద్ద‌రిలో గెలిచేదెవ‌రు?

By:  Tupaki Desk   |   30 Jun 2021 10:30 AM GMT
రాజీవ్ ఖేల్ ర‌త్నః ఆ ఇద్ద‌రిలో గెలిచేదెవ‌రు?
X
దేశంలో అత్యున్న‌త క్రీడా పుర‌స్కారం రాజీవ్ ఖేల్ ర‌త్న‌. క్రీడ‌ల్లో అనిత‌ర‌సాధ్య‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన వారికి ఇచ్చే దేశీయ అవార్డు ఇది. ఈ అవార్డును ద‌క్కించుకోవ‌డం క్రీడాకారుల క‌ల‌. అయితే.. కొంద‌రికి మాత్ర‌మే అది సాధ్య‌మ‌వుతుంది. ఈ ఏడాదికి గానూ ఈ అవార్డు కోసం భారత క్రికెట్ త‌ర‌పు నుంచి ఇద్ద‌రి పేర్ల‌ను సిఫార్సు చేసింది బీసీసీఐ.

అందులో ఒక‌రు పురుషుల జ‌ట్టు ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కాగా.. మ‌రొక‌రు మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌. వీరిద్ద‌రినీ ఖేల్ ర‌త్న‌కు సెల‌క్ట్ చేయ‌గా.. శిఖ‌ర్ ధావ‌న్‌, బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్ల‌ను అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసింది. ఈ మేర‌కు క్రీడామంత్రిత్వ శాఖ‌కు ద‌ర‌ఖాస్తులు పంపించిన‌ట్టు బీసీసీఐ వెల్ల‌డించింది.

మిథాలీ రాజ్ సేవ‌ల‌ను గ‌మ‌నిస్తే.. ఒక‌టీ రెండు కాదు ఏకంగా.. 22 సంవ‌త్స‌రాలుగా క్రికెట్ ఆడుతోంది. మ‌రో మూడు నెల‌ల గ‌డిస్తే.. స‌చిన్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టి.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక కాలం క్రికెట్ ఆడిన క్రీడాకారుల జాబితాలో అగ్ర‌స్థానంలో నిలుస్తుంది. ఈ సుదీర్ఘ కెరీర్ లో టీమిండియా జ‌ట్టుకు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించింది మిథాలీ రాజ్‌. ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో ప్ర‌స్తుతం టాప్ 5లో కొన‌సాగుతోంది.

ఇటు అశ్విన్ సైతం కొంత కాలంగా మంచి ఆట‌తీరును క‌న‌బ‌రుస్తున్నాడు. టెస్టులు భార‌త్ త‌ర‌పున 400 వికెట్లు తీసిన మూడో స్పిన్న‌ర్ గా చ‌రిత్ర‌లో చోటు ద‌క్కించుకున్నాడు. 2019 - 21 కాలంలో నిర్వ‌హించిన డ‌బ్ల్యూటీసీ టోర్నీలో 71 వికెట్లు తీసి అగ్ర‌స్థానంలో నిలిచాడు.