Begin typing your search above and press return to search.

బీసీజీ రిపోర్టులో ఏముంది..విశాఖ‌ను ఎందుకు ఓకే చేసింది?

By:  Tupaki Desk   |   3 Jan 2020 4:43 PM GMT
బీసీజీ రిపోర్టులో ఏముంది..విశాఖ‌ను ఎందుకు ఓకే చేసింది?
X
గ‌త కొద్దిరోజులుగా ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రిపోర్ట్ నివేదిక వెల్ల‌డైంది. రాజధాని అమరావతిపై బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ తుది నివేదికను ఏపీ సీఎం జగన్‌కి అందజేసింది. సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌ ను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికను అందజేసి.. అందులో అంశాలను పూర్తిగా వివరించారు. అనంత‌రం - ఏపీ ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్‌ కుమార్ వివ‌రించారు. వివిధ దేశాల అభివృద్ధి ఆధారంగా ఏపీ అభివృద్ధికి సూచనలు చేశారని, ఏపీ సమగ్రాభివృద్ధిపై వివిధ ప్ర‌త్యామ్నాయాలు అందించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. బీసీజీ మూడు ప్ర‌త్యామ్నాయాలు ఇచ్చింద‌ని తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని బీసీజీ కమిటీ ఆరు ప్రాంతాలుగా విభజించి అధ్యయనం చేసిందని వెల్ల‌డించారు. ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం) - గోదావరి డెల్టా (తూర్పు గోదావరి - పశ్చిమగోదావరి) - కృష్ణా డెల్టా (కృష్ణా - గుంటూరు) - దక్షిణాంధ్ర (నెల్లూరు - ప్రకాశం) - ఈస్ట్‌ రాయలసీమ (చిత్తూరు - కడప) వెస్ట్‌ రాయలసీమ (కర్నూలు - అనంతపురం)గా వాటిని విభజించింద‌ని పేర్కొన్నారు. అమరావతిపై పెట్టే డబ్బు అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెడితే మంచిదని స్థూలంగా వెల్ల‌డించింది. అమరావతిపై పెట్టే రూ.లక్ష కోట్లను నీటి పారుదలపై పెడితే మంచి ఫలితాలొస్తాయని సైతం ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది. విశాఖ నగరం మంచి మౌలిక సదుపాయాలు కలిగి ఉందని, మిగ‌తా ప్రాంతాల‌న్నింటితో పోలిస్తే - రాజ‌ధానికి స‌రైన ఎంపిక అని వెల్ల‌డించింది.

ఇక విశాఖ ప్ర‌త్యేక‌త‌ల‌ను బీసీజీ స‌వివ‌రంగా తెలిపింది. విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్‌ కనెక్టివిటీ ఉందని బీసీజీ వెల్ల‌డించింది. విశాఖలో మాత్రమే పోర్టులు అభివృద్ధి చెంది ఉన్నాయని పేర్కొంది. విశాఖలో మాత్రమే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ సర్వీసులు ఉన్నాయన్నారు. విశాఖ ప‌ర్యాటక‌రంగంలో టాప్‌ లో ఉందని పేర్కొంది.