Begin typing your search above and press return to search.

కరోనా వైరస్: 14,600 దాటిన మృతులు.. వణికిపోతున్న ప్రపంచం!

By:  Tupaki Desk   |   23 March 2020 7:54 AM GMT
కరోనా వైరస్: 14,600 దాటిన మృతులు.. వణికిపోతున్న ప్రపంచం!
X
కరోనా వైరస్ ...ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఒకరకంగా చెప్పాలి అంటే ..ఈ వైరస్ కారణంగా అన్ని దేశాలు కూడా ఏకమైయ్యాయి. ఒకప్పుడు దేశాల మధ్య ఆధిపత్యం కోసం కొట్టుకున్న దేశాలు కూడా ఈ కరోనా వైరస్ దెబ్బకి కలిసిపోయి , దీనికి విరుగుడు గురించి చర్చించుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు మా దేశం వద్ద అన్ని  అణ్వాయుధాలు ఉన్నాయి అని ఒక దేశం అంటే , మా మా దేశం వద్ద అన్ని  అణ్వాయుధాలు ఉన్నాయి అని ఎగిరెగిరి పడ్డాయి. కానీ , ఎంత ఆధిపత్యం ఉండి ఏమి లాభం, ఎంత అగ్రరాజ్యంగా అయినా కూడా ఏం ప్రయోజనం… ఎంత సంపాదన ఉండి కూడా ఏమున్నది గర్వకారణం.. ఒక కంటికి కనిపించని సూక్ష్మజీవి ముందు ప్రపంచం మొత్తం మోకరిల్లిపోయింది.

ప్రపంచంలోనే అగ్రరాజ్యమని ఎగిరెగిరి పడుతున్న దేశానికి, ఆ అగ్రరాజ్యానికి మేమే పోటీ అని మదమెక్కి కొట్టుకుంటున్న మన పరాయి మరో పొరుగు పెద్ద దేశానికి ఒక పెద్ద గుణపాఠం నేర్పింది ఈ కరోనా వైరస్‌. ప్రస్తుతం ప్రపంచంలోని ఆయా దేశాలు తమలో తాము కొట్టుకోవడం మానేసి ఈ వైరస్‌ ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాయి. ఈరోజు ప్రపంచ దేశాల ముందు ఉన్న ఏకైక సమస్య కరోనా. ఈ వైరస్‌ తో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం  అవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులైంది. గత కొన్ని దశాబ్దాలలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితులు  ఈరోజు ప్రపంచంలో నెలెకొన్నాయి. ప్రపంచ వ్యాప్తం విమాన ప్రయాణాలు ఆగిపోయాయి.  సముద్రంలో బోటు నడవడం లేదు, ప్రపంచ మార్కెట్‌ స్తంభించి పోయింది, షేర్ల విలువలు భారీగా  పడిపోయాయి, వ్యాపార వాణిజ్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎగు మతులు, దిగుమతులు దాదాపు ఆగిపోయాయి.. దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ అవుట్ ప్రకటించాయి. ఇప్పుడు 180 దేశాలలో ఒకటే మాట ఒకటే ప్రయత్నం  కరోనా వైరస్‌ కి మందు కనిపెట్టి ..ఆ సమస్య నుండి బయటపడటం.

ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా విద్వేషాలను మరిచి ఆధిపత్య పోరు బాట విడిచి, ఈ వైరస్‌ను ఎదుర్కోవడం పైన దృష్టి పెట్టాయి. ఈ వైరస్‌ ప్రపంచానికి ఇస్తున్న సంకేతం ఏమిటంటే మీ దగ్గర ఉన్న అణ్వాయిదాల కంటే నేను ఎంతో శక్తిమంతురాలిని అని, మీ దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు ప్రయోగించినా నన్ను నాశనం చేయలేరని.. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలు తెలుసుకోవాల్సింది ఆయుధాలు పేరుకుపోవడం వల్ల తమకు ఎటువంటి రక్షణ లేదని, కేవలం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం, వైద్య విధానాలను అభివృద్ధి పరచుకోవడం, ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడంపైనే ఆయా దేశాలు ప్రధానంగా దృష్టిసారించాలి.

ఈరోజు ప్రపంచం సామూహికంగా ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళలో ఒకటి ఉగ్రవాదం అయితే, రెండోది కరోనా వైరస్‌. మొదటిది మతపరమైన ఉన్మాదంతో జరుగుతున్న చర్య, ఇది స్వయం మానవ తప్పిదం. కొన్ని లక్షలమంది ఈ చర్యకు బలయ్యారు. దాదాపు 50కిపైగా దేశాలు ఉగ్రవాదం బారినపడి ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద నిర్మూలన కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గత ఆరేళ్లుగా కొనసాగిస్తున్న పోరాటం చూస్తున్నాం. పాకిస్తాన్‌ లాంటి ఉగ్రవాద ప్రేరేపిత దేశాలు తప్పితే ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ పోరాటానికి వెన్ను దన్నుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం మూలంగా ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది మరణాలతోపాటు కొన్ని లక్ష కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఈవేళ ఇదే ఉన్మాదం కొనసాగితే ప్రపంచం భవిష్యత్తులో ఇంకెంత నష్టపోతుందో చెప్పలేము. కాబట్టి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూ లించడం ఇప్పుడు ప్రపంచ దేశాల అన్నిటిపై ఉన్న ప్రధాన బాధ్యత. ఇక రెండోది కాలానుగుణంగా వాతావరణ మార్పులను బట్టి ప్రబలుతున్న వైరస్‌. మనిషి ఆహారపు అలవాట్లు, ప్రకృతిని చెర పట్టడం, పర్యా వరణాన్ని కలుషితం చేయడం వంటి చర్యల ద్వారా మానవ సమాజం తన వినాశనాన్ని తానే కొన్ని తెచ్చు కుంటోంది..

గత చరిత్రను పరిశీలిస్తే ఈ భూమ్మీద ఎన్నో రకాల వైరస్ లు పుట్టుకొచ్చాయి, మృత్యు ఘంటికలు మోగించాయి. కాలక్రమంలో వైరస్ రావడం… వాటికి వ్యాక్సిన్లు కనుగొనడం జరుగుతూ వచ్చింది. అయితే వాతావరణ మార్పు వల్ల వైరస్‌ పుట్టుక ఆగలేదు. ఇలా ఎంతకాలం..?? ఇప్పుడు ప్రపంచం ఒక గ్లోబల్‌ విలేజ్‌గా మారింది. ఒక దేశంలో వైరస్‌ వచ్చినా ప్రపంచం మొత్తం చుట్టిరావడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. రెండు నెలల క్రితమే చైనాలోని ఉహాన్‌ నగరంలో పుట్టిన వైరస్‌ ఇంత తక్కువ సమయంలో 163 దేశాలకు పాకిందంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రపంచ జన జీవనమే స్థంభించిపోయింది. కొన్ని దేశాలో హెల్త్‌ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజలు  ఇళ్ళల్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఆహారం, నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతోంది. కొద్దిరోజులు ఇలాగే కొనసాగితే అగ్రరాజ్యాలే ఆహారం కోసం అలమటించే పరిస్థితులు నెలకొనవచ్చు.

వైరస్‌ అనేది ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్యో అని సరిపెట్టుకోనవసరం లేదు. వైరస్‌ను అరికట్టడం ప్రతి దేశం తన బాధ్యతగా భావించాలి, వైరస్‌ నిరోధానికి, వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అన్ని దేశాలు సంయుక్తంగా కృషి చేయాలి. ఆయా దేశాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ యుద్ధం చేయాల్సింది ఇలాంటి వైరస్‌ మీద. లేదంటే ప్రపంచం అడుక్కుతినే స్థాయికి పడిపోతుంది.

కాగా , అమెరికా లో  ఈ వైరస్  బారినపడి మరణించిన వారిసంఖ్య 419కు చేరింది. బాధితుల సంఖ్య కూడా 33వేల దాటింది. అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు వైరస్ విస్తరించింది. ఇప్పటికే పలు నగరాలను మూసివేశారు. తాజాగా, న్యూయార్క్ నగరం సైతం లాక్‌డౌన్‌లోకి వెళ్లనుంది. 8.5 మిలియన్ల మంది జనాభా కలిగిన న్యూయార్క్ నగరంలో వైరస్ కేసులు సంఖ్య పెరిగితే ప్రపంచంలోనే మరో అతిపెద్ద వైరస్ కేంద్రంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. దీనితో అమెరికా అధినేత ట్రంప్ ..దీనిపై యుద్ధం ప్రకటించి సహాయక చర్యలు ముమ్మరం చేసారు. ఇక భారత్ లో కూడా కరోనా వేగంగా విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 415కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్  తాజాగా ప్రకటించింది.  

దీనితో ఈ భయంకరమైన కరోనా మహమ్మారిని అరికట్టడానికి పలు దేశాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆదేశాలు  జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 14,650 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 3,37,533కి చేరింది. గడచిన 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 1,450 మంది మృతిచెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింత ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక దూరం లాంటి కట్టుబాట్లను ప్రజలు పాటిస్తున్నా వైరస్‌ విజృంభిస్తోంది. అయితే, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ వైరస్‌ను అడ్డుకోవడంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. దీన్ని బట్టి వైరస్‌ ఏ స్థాయిలోకి చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.  మొత్తంగా  ప్రభుత్వం వారు ఇస్తున్న ఆదేశాలను, సలహాలను పాటించడం వల్ల కొంతలో కొంతైన ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు ..కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ప్రభుత్వ సలహాలు  తప్పకుండా పాటించి , ప్రభుత్వానికి  సహకరించండి..