Begin typing your search above and press return to search.

అప్ప‌ల్రాజు సైలెంట్ అయిపోయాడు ఎందుకంటే?

By:  Tupaki Desk   |   12 Feb 2022 7:36 AM GMT
అప్ప‌ల్రాజు సైలెంట్ అయిపోయాడు ఎందుకంటే?
X
విధుల్లో ఉన్న‌పోలీసుల‌ను గుడ్డ‌లూడ‌దీసి కొడ‌తా అంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు త‌మ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ (అమ‌రావ‌తి) చేసిన డిమాండ్ కు పెద్ద‌గా స్పంద‌న రాలేదు. మొన్న‌టి వేళ విశాఖ శార‌దా పీఠం వార్షికోత్స‌వాల‌కు విచ్చేసిన సీఎంను క‌లిసేందుకు అక్క‌డికి వ‌చ్చిన మంత్రి అప్ప‌ల్రాజు పోలీసుల‌తో త‌గువు ప‌డ్డారు.నోటికి వ‌చ్చిన విధంగా తిట్టారు.డ్యూటీలో ఉన్న ఆఫీస‌ర్ పై చేయి చేసుకున్నంత ప‌నిచేశారు.

ఆయ‌న‌న్ను వెన‌క్కి నెట్టేస్తూ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.రాసేందుకు వీల్లేని భాష‌ను ఉప‌యోగించారు.ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది.అప్ప‌ల్రాజు ప్ర‌వ‌ర్త‌న‌పై పోలీసు సంఘాలు భ‌గ్గుమంటున్నాయి.ఆయ‌న‌కు త్వ‌ర‌లో ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని అంటూ ఓ లేఖ విడుద‌ల చేశాయి సంబంధిత వ‌ర్గాలు.ఈ లేఖ విడుద‌ల చేసి 24 గంట‌లు దాటిపోయినా కూడా మంత్రి నుంచి స్పంద‌న రాలేదు.వివ‌ర‌ణ రాలేదు.క‌నీసం సోష‌ల్ మీడియా ద్వారా ఓ ప్ర‌క‌ట‌న రూపంలో అయినా త‌న ప్ర‌వ‌ర్త‌నపై ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేస్తూ ఆయ‌న మాట్లాడ‌లేదు. దీంతో పోలీసు వ‌ర్గాలు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నాయి.

ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న మంత్రి,త‌న హోదానూ,స్థాయినీ మ‌రిచి ప్ర‌వ‌ర్తించ‌డంతో వివాదం రేగింది. దీనిపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంది అన్న వాద‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లీయంగా వినిపించింది.కానీ ఎందుక‌నో ఆయ‌న నుంచి ఎటువంటి స్పంద‌నా లేదు.దీంతో వివాదం ముగిసింద‌ని భావించాలో లేదా మంత్రి తర‌ఫు వ్య‌క్తులు పోలీసుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి త‌గువును సామ‌రస్య పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకున్నార‌ని అర్థం చేసుకోవాలో అన్న‌ది స్ప‌ష్ట‌త లేదు.దీంతో ఈ పరిణామం ఇప్ప‌టివ‌ర‌కూ ఓ అప‌రిష్కృతంగానే ఉంది.

ఇదిలా ఉంటే గ‌తంలోనూ ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో పోలీసుల‌పై అదుపు త‌ప్పి వ్యాఖ్య‌లు చేసిన దాఖ‌లాలు ఉన్నాయి.ముఖ్యంగా ప్రోటోకాల్ వివాదాల్లో ఆయ‌న ఇరుక్కుపోయిన దాఖ‌లాలు ఉన్నాయి.ఆయసంద‌ర్భాల్లో ఆయ‌న అదుపు త‌ప్పి చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా పోలీసు ఉన్న‌తాధికారుల‌తో ఆయ‌న త‌గువులు ప‌డిన సంద‌ర్భాలూ ఉన్నాయి.ముఖ్యంగా ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా అనుచ‌రుల‌తో ఎక్కువ‌గా హంగామా చేస్తారు.దీంతో వారిని నిలువ‌రించే ప్ర‌య‌త్నంలో పోలీసులు ప్రోటోకాల్ నిబంధ‌న‌ల‌ను తెర‌పైకి తెస్తున్నారు.

ఆ మ‌ధ్య రెడ్డి శాంతి (పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే) కుమార్తె వివాహం అనంత‌రం నిర్వ‌హించిన వేడుక‌ల్లోనూ ఇదే విధంగా ప్ర‌వ‌ర్తించారు. ఆ వేడుకుల‌కు సీఎం హాజ‌రు అయ్యారు. ఆ రోజు కూడా ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర‌కు త‌న అనుచ‌రుల‌ను తీసుకుని పోయేందుకు తెగ ప్ర‌య‌త్నించి ఆఖ‌రిని నిమిషాన విఫ‌లం అయ్యారు.అప్పుడు కూడా పోలీసులు ప్రోటోకాల్ నిబంధ‌న‌ల కార‌ణంగా ప‌రిమితికి మించి సీఎం వ‌ద్ద‌కు వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను కానీ మంత్రి అనుచ‌రుల‌ను కానీ పంప‌లేమ‌ని అడ్డుకున్నారు.

అప్పుడు కూడా మంత్రి రెచ్చిపోయారు.ఇప్పుడు కూడా మంత్రి అదేవిధంగా విశాఖ శార‌దా పీఠం వ‌ద్ద రెచ్చిపోయారు.దీనిపై ముఖ్య‌మంత్రి కూడా పెద్ద‌గా స్పందించ‌లేదు. సీఎంఓ కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.అంటే మంత్రి అప్ర‌ల్రాజు ధోర‌ణి పై సీఎం కూడా సానుకూలంగా లేర‌న్న‌దే స్ప‌ష్టం అయిపోయింది.అయినా కూడా ఆయ‌న మారరు.జిల్లా అధికారులను ప‌లు స‌మీక్షా స‌మావేశాల్లో తిట్ట‌డం మానరు.స్థాయి మ‌రిచి మాట్లాడ‌డం కూడా నేర్చుకోరు.