Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర అసెంబ్లీలో హాట్ టాపిక్ గా ఆ మహిళా ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   1 March 2020 4:42 AM GMT
మహారాష్ట్ర అసెంబ్లీలో హాట్ టాపిక్ గా ఆ మహిళా ఎమ్మెల్యే
X
చట్టసభలు ఏవైనా కావొచ్చు.. అవి జరిగే వేళలోనూ హాజరు కాకుండా డుమ్మా కొట్టే ప్రజాప్రతినిధులు చాలామందే కనిపిస్తారు. అందుకు భిన్నంగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ మహిళా ఎమ్మెల్యే నమిత ముందాడ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీపీకి చెందిన ఈ మహిళా నేత చివరిక్షణంలో బీజేపీలో చేరటమే కాదు.. ఎన్నికల్లో విజయం సాధించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం తాను ఎనిమిది నెలల గర్భిణి అన్న విషయాన్ని పక్కన పెట్టి మరీ అసెంబ్లీకి వచ్చిన ఆమె తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఒకప్పుడు భ్రూణ హత్యలతో అపఖ్యాతి మూటగట్టుకున్న బీడ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమె.. గర్భవతిగా ఉండి కూడా అసెంబ్లీకి హాజరై.. ప్రజా సమస్యల గురించి గళం విప్పారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తొలి గర్భిణిగా తనను గుర్తిస్తున్నట్లుగా ఆమె చెబుతున్నారు. గర్భం దాల్చటం మహిళ జీవితంలో ఒక భాగమని.. అదో పరిణామంగా ఆమె అభివర్ణిస్తున్నారు. తనపై ఎవరూ సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం లేదన్న ఆమె.. ఎనిమిది నెలల గర్భిణిగా ఉండి కూడా అసెంబ్లీకి హాజరు కావటం ద్వారా తానెంత శక్తివంతమైన మహిళ అన్న విషయాన్ని నమిత చెప్పకనే చెప్పేస్తున్నారని చెప్పాలి.

బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ.. ప్రజా సమస్యల మీద గళం విప్పాల్సిన బాధ్యత తన మీద ఉందని.. అందుకే సమావేశాలకు హాజరైనట్లుగా ఆమె చెప్పారు. చాలామంది ఆరోగ్యంగా ఉండి కూడా సభలకు నిర్లక్ష్యంతో డుమ్మా కొడుతుంటారు. అలాంటిది శారీరకంగా కాస్త కష్టమైనప్పటికీ.. ఇబ్బందుల్ని పట్టించుకోకుండా ప్రజల సమస్యల గురించి ప్రస్తావించేందుకు అసెంబ్లీకి హాజరువుతున్న ఆమె తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.