Begin typing your search above and press return to search.

వేడి రోజుల్లో బీరు తాగితే దెబ్బ పక్కా

By:  Tupaki Desk   |   20 April 2016 5:30 PM GMT
వేడి రోజుల్లో బీరు తాగితే దెబ్బ పక్కా
X
మంట పుట్టే వేడి రోజుల్లో చల్లచల్లటి బీరు తాగితే ఆ కిక్కే వేరప్పా అనటం చాలామంది దగ్గర వింటుంటాం. కానీ.. ఆ మాటల్లో నిజం ఎంతన్నది ప్రశ్న. మాటలు చెప్పుకోవటానికి శాస్త్రీయతకు మధ్యనున్న తేడా బీరు విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. మండే ఎండ ఉన్న వేళ కూల్ బీర్ తాగితే రిలీఫ్ ఎక్కువన్న మాట ఉత్తదేనని నిపుణులు చెబుతుంటారు. ఎందుకిలా అంటే.. వారు సుదీర్ఘ వివరణ ఇస్తారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బీర్ తాగటం అంటే సమస్యను ‘‘కొని’’ తెచ్చుకున్నట్లే. ఎందుకంటే.. బీర్ మొదలు ఏ ఆల్కాహాల్ అయినా శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తుందన్నది చేదు నిజం. దీనికి నిదర్శనం ఏమిటంటే.. ఆల్కాహాల్ తాగిన వారు తరచూ యూరినస్ కు వెళ్లటమే. ఇలా తరచూ బాత్రూంకి వెళ్లటం కారణంగా డీహైడ్రేషన్ కు గురి కావటం ఖాయమని చెబుతున్నారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఎక్కువగా బీర్లు తాగుతుంటారు. స్నేహితులతో కూర్చొని మాటలు చెబుతూ బీర్లు లాగించేస్తుంటారు. ఇలా చేయటం కారణంగా శరీరంలోని నీరు.. సోడియం.. పోటాషియం అన్నీ బయటకు వెళ్లిపోతుంటారు. చెమట కారణంగా మరింత నీరు బయటకు వచ్చేస్తుంది. అన్ని కలిసి డీహైడ్రేషన్ కు కారణమవుతుంది. అందుకే.. ఎండాకాలంలో కూల్..కూల్ బీర్లు మాత్రమే కాదు.. అల్కాహాల్ కంటెంట్ ఉన్న ఏ ద్రవపదార్థాన్ని తాగటం ఏ మాత్రం మంచిది కాదన్నది మర్చిపోకూడదు.