Begin typing your search above and press return to search.

చినుకు ప‌డే వ‌ర‌కూ బీరు చింత తీర‌ద‌ట‌!

By:  Tupaki Desk   |   3 Jun 2019 8:48 AM GMT
చినుకు ప‌డే వ‌ర‌కూ బీరు చింత తీర‌ద‌ట‌!
X
సీజ‌న్ ఏదైనా స‌రే.. చిల్డ్ బీర్ కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ కాలంలో అయితే ఎక్కువ బీర్ తాగ‌కూడ‌దో అదే కాలంలో అమితంగా తాగేయ‌టం క‌నిపిస్తుంది. ఎండ‌ల వేళ‌.. బీర్ తాగ‌టం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కానీ.. అదేమీ పట్టించుకోకుండా హాట్ హాట్ స‌మ్మ‌ర్ లో చిల్డ్ బీరును ఎంచ‌క్కా ఎంజాయ్ చేయ‌టం కనిపిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. బీరుకు ఇప్పుడు కొత్త క‌ష్టం వ‌చ్చి ప‌డింది.

హైద‌రాబాద్ తో స‌హా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీరు క‌రవు వ‌చ్చి ప‌డింది. మ‌ద్యం దుకాణాల్లో.. బార్ల‌ల్లో బీర్లు నో స్టాక్ అన్న బోర్డులు ఎక్కువ అవుతున్నాయి. నీటి ఎద్ద‌డి కార‌ణంగా.. బీరు ఉత్ప‌త్తి మీద ప్ర‌భావం ప‌డింది. దీంతో.. బీరు కొర‌త అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

ఎండ‌ల కార‌ణంగా న‌దులు.. జ‌లాశ‌యాలు ఎండిపోవ‌టంతో బీరును ఉత్ప‌త్తి చేయ‌టం ఇబ్బందిక‌రంగా మారింది. ప‌లు బెవ‌రేజ్ కంపెనీలు బీరు ఉత్ప‌త్తిలో కోత విధించారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జ‌లాశ‌యం నుంచి స‌ర‌ఫ‌రా చేసే నీటితో దాదాపు ఐదు బెవ‌రేజ్ కంపెనీలు బీర్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంటాయి. అయితే.. జ‌లాశ‌యంలో నీళ్లు లేక‌పోవ‌టంలో బీర్ల త‌యారీని కంపెనీలు నిలిపివేశాయి. దీంతో.. డిమాండ్ కు త‌గ్గ‌ట్లు స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌టంతో ప‌లు బార్లు.. మ‌ద్యం దుకాణాల్లో బీర్ కు నో స్టాక్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

నీటి కొర‌త కార‌ణంగా కోరుకున్న బీరు బ్రాండ్ దొర‌క‌టం లేద‌న్న కంప్లైంట్లు ఎక్కువ అవుతున్నాయి. అయితే.. చినుకు ప‌డే వ‌ర‌కూ ఈ చింత త‌ప్ప‌ద‌ని.. క‌నీసం మ‌రో నెల వ‌ర‌కూ బీరును పొదుపుగా వాడ‌టం మిన‌హా మ‌రో మార్గం లేదంటున్నారు. గ‌తంలో 100 కార్టున్ల బీరు స‌ర‌ఫ‌రా చేసే వైన్స్.. బార్ల‌కు కేవ‌లం 10 నుంచి 20 కార్టున్ల బీరు మాత్ర‌మే బెవ‌రేజెస్ కార్పొరేష‌న్ ద్వారా అందుతోంది. దీంతో.. ఆచితూచి అన్న‌ట్లుగా బీర్ల‌ను అమ్ముతున్నారు. బీరు దొర‌కాలంటే రిక‌మండేష‌న్ కూడా అవ‌స‌రం అవుతుందోన్న మాట కొంద‌రి నుంచి వినిపిస్తోంది.