Begin typing your search above and press return to search.

దిసీజ్ ఫైనల్ : ముందస్తు ఎన్నికలు లేనట్టే

By:  Tupaki Desk   |   1 March 2018 10:27 AM GMT
దిసీజ్ ఫైనల్ : ముందస్తు ఎన్నికలు లేనట్టే
X
సార్వత్రిక ఎన్నికలు ముందుగా వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? జమిలి ఎన్నికలకు ప్లాన్ చేస్తున్న మోడీ సర్కారు.. అటు ఈసీ నుంచి కూడా తాము సన్నద్ధం అని సిగ్నల్ వచ్చేయడంతో ఈ ఏడాది చివరిలోగా ఎన్నికల నిర్వహణకు ఉపక్రమిస్తుందా? అనే ఊహాగానాలు చాలా రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. సాధారణంగా వచ్చే ఏడాది ఏప్రిల్ - మే సమయానికి జరగాల్సిన ఎన్నికలు.. జమిలి ఎన్నికలైతే గనుక.. ముందుకు రావచ్చునని అంతా అనుకుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలు.. ప్రధాని మరియు భాజపా జాతీయ అధ్యక్షుడ అమిత్ షాల మాటల్ని గమనిస్తే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని అర్థమవుతోంది. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో 13 రాష్ట్రాల పార్టీ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వారికందరికీ రాబోయే సార్వత్రిక ఎన్నికలను భాజపాకు అనుకూల ఫలితాలు వచ్చేలా ఎదుర్కొనడానికి ఎలాంటి వ్యూహరచన చేయాలో సమావేశంలో నిర్ణయించారు.

పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. సత్వరం దీనిపై ఏకాభిప్రాయం సాధించాలని అంటున్నారు. 2018-19 లోగా ఏకాభిప్రాయం రాకపోతే గనుక.. కనీసం 2022 లోగా సాధించాలని పార్టీ నాయకులు మార్గనిర్దేశం చేయడం గమనార్హం.

భాజపా చెబుతున్నట్లుగా ఇప్పటికిప్పుడు అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయాన్ని సాధించడం అంత సులువైన సంగతి కాదు. ఎటూ వాళ్లే గడువు విషయంలో రాజీపడి 2022 లోగా అంటున్నారు గనుక.. అప్పటిదాకా ఏకాభిప్రాయం పనిలోనే ఉంటారని.. 2019 ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతోనే సన్నద్ధం అవుతున్నట్లుగా కొన్పి సంకేతాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలు వచ్చినా రావచ్చుననే ఉద్దేశంతోనే.. దానికి తగినంత సమయం ఉండేలాగా పాదయాత్రను ప్రారంభించేశారు. ఇప్పుడు షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు అంటే.. తెలుగు నాయకులకు ఓపినంత వ్యవధి ఉన్నట్టే లెక్క.