Begin typing your search above and press return to search.

బడ్జెట్ ను వినే ముందు.. వీటి గురించి తెలుసుకోవటం చాలా అవసరం

By:  Tupaki Desk   |   1 Feb 2022 6:30 AM GMT
బడ్జెట్ ను వినే ముందు.. వీటి గురించి తెలుసుకోవటం చాలా అవసరం
X
యావత్ దేశం బడ్జెట్ కోసం ఆశగా.. ఆసక్తిగా ఎదురుచూస్తోంది.దీనికి కారణాలు లేకపోలేదు. ప్రధానమంత్రిగా మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రవేశ పెట్టిన బడ్జెట్ లలో ఇది కాస్తా భిన్నమైనది.. ప్రత్యేకమైనది కూడా. మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడున్నరేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు.. కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీఎన్నికలతో పాటు.. మరో నాలుగు రాష్ట్రాల్లోనూ (ఉత్తరాఖండ్.. గోవా.. పంజాబ్.. మణిపూర్) అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్నాయి.

ఇలాంటివేళలో.. బడ్జెట్ లో ప్రకటించే అంశాలు ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను చదివే వేళ.. వినే చాలామందికి కొన్ని పదాలకు అర్థం తెలీని పరిస్థితి. మరికొందరికిఏదో అర్థమవుతున్నట్లు ఉంటుందే తప్పించి.. దాని అర్థం లోతుగా తెలీని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా.. బడ్జెట్ ప్రవేశ పెట్టే నేపథ్యంలో.. ఇందులో ఎక్కువగా వినిపించే కొన్ని పదాల గురించి తెలుసుకోవటం మంచిది.

బడ్జెట్

బడ్జెట్ అంటే ఒక ఏడాది కాలానికి దేశంలో ఖర్చులు.. ఆదాయానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని తెలియజేసే వివరాల సమాహారం. బడ్జెట్ వల్ల ప్రభుత్వం వద్ద ఉన్న నిధుల నిర్వహణ సులభతరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా కొనసాగుతాయి.

ఆర్థిక సంవత్సరం

కొత్త సంవత్సరం అంటే.. జనవరిలో మొదలై డిసెంబరులో ముగుస్తుంది. అదే విద్యా సంవత్సరం అంటే జూన్ లో మొదలై మార్చితో ముగుస్తుంది. అలానే ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థిక సంవత్సరం అంటే.. ప్రతి ఏప్రిల్ 1తో మొదలై మార్చి 31తో ముగుస్తుంది. దీన్ని ఆర్థిక సంవత్సరంగా పిలుస్తారు. ఆర్థిక రంగానికి సంబంధించి.. ఏడాది అంటే.. ఏప్రిల్ 1తో మొదలై.. మార్చి 31తో ముగుస్తుంది.

జీడీపీ - స్థూల దేశీయోత్పత్తి

ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తుసేవల మెత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంటారు. దేశ ఆర్థికవ్యవస్థ స్థితిని తెలిపే కీలకాంశంగా దీన్ని చెప్పాలి. మరింత బాగా అర్థం కావాలంటే.. ఒక ఇంట్లో భార్య.. భర్త.. కొడుకు ఉద్యోగం కానీ వ్యాపారం చేస్తుంటే.. ఏడాది వ్యవధిలో వారు సంపాదించే మొత్తాన్ని ఒక ఇంటి జీడీపీగా వ్యవహరించొచ్చు.

ద్రవ్యలోటు

ఒక ప్రభుత్వ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే.. ఆ పరిస్థితిని ‘ద్రవ్యలోటు’గా వ్యవహరిస్తారు. అయితే.. ఈ ద్రవ్యలోటును లెక్కించేటప్పుడు రుణాల్ని పరిగణలోకి తీసుకోరు.

కరెంటు ఖాతా లోటు

వస్తుసవేల దిగుమతుల విలువ.. ఎగుమతి విలువ మధ్య ఉండే తేడాను కరెంటు ఖాతా లోటుగా వ్యవహరిస్తారు.

ప్రత్యక్ష.. పరోక్ష పన్నులు

ప్రజలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నుల్ని ప్రత్యక్ష పన్నులు అంటారు. ఆదాయపన్ను (ఇన్ కం ట్యాక్స్), ఆస్తి పన్ను, కార్పొరేట్ పన్ను ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ. అలాకాకుండా వ్యాట్ .. అమ్మకం పన్ను.. సేవా పన్ను.. లగ్జరీ ట్యాక్స్.. వినోద పన్ను తదితర పన్నులు పరోక్ష పన్నులకు ఉదాహరణలుగా చెప్పొచ్చు.

దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను

షేర్లు కొన్న తర్వాత ఏడాది లోపు వ్యవధిలో వాటిపై ఆర్జించే లాభాల్ని స్వల్పకాలిక మూలధన లాభాలు అంటారు. వీటిపై ప్రస్తుతం 15 శాతం పన్ను ఉంది. ఏడాది కన్నా ఎక్కువ సమయంలో వాటిపై ఆర్జించే లాభాల్ని దీర్ఘకాలిక మూలధన లాభాలు అంటారు. వీటిపై ప్రస్తుతం పన్ను లేదు. అయితే.. షేర్లపై లాభాల్ని దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి.. వాటిపై పన్ను విధించకుండా ఉండాలంటే ఇకపై ఏడాది కాలాన్ని కాకుండా అంతకన్నా ఎక్కువ వ్యవధిని లెక్కలోకి తీసుకోవాలన్న ప్రచారం సాగుతోంది.

ఆర్థిక బిల్లు

ఇప్పటికే అమలులోఉన్న పన్ను విధానంతో మార్పులను.. కొత్త పన్నులను ప్రభుత్వం ఆర్థికబిల్లులో ప్రతిపాదిస్తుంది. బడ్జెట్ ను సమర్పించిన వెంటనే దీన్ని ప్రవేశ పెడతారు.

వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి

ఒక ఉద్యోగి వ్యక్తిగత వార్షికాదాయానికి ఇచ్చే ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ప్రస్తుతం ఇది రూ.2.5 లక్షల వరకు మినహాయింపు ఉంది. ఈసారికి ఈ మినహాయింపు పరిమితిని ప్రభుత్వం పెంచుతుందని చెబుతున్నారు.

రెపో రేటు

రిజర్వుబ్యాంకు తమకు వచ్చే స్వల్పకాలిక రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు.

పెట్టుబడుల ఉపసంహరణ

ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం తన వాటాల్ని ప్రభుత్వం పాక్షికంగా లేదంటే పూర్తిగా విక్రయించడాన్ని పెట్టుబడుల ఉపసంహరణగా చెబుతారు.