Begin typing your search above and press return to search.

సంక్రాంతి పండక్కి కాస్త ముందు ఏపీలో ఎన్నికల హడావుడి షురూ

By:  Tupaki Desk   |   21 Dec 2019 4:47 AM GMT
సంక్రాంతి పండక్కి కాస్త ముందు ఏపీలో ఎన్నికల హడావుడి షురూ
X
క్యాలెండర్లో చాలానే పండుగలున్నా.. ఏపీ వరకూ చూస్తే మాత్రం సంక్రాంతి వారికి చాలా పెద్ద పండుగ. మూడు రోజుల పండుగను నాలుగైదు రోజుల పాటు చేసుకోవటమే కాదు.. దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఆంధ్రోళ్లు.. సంక్రాంతి పండుగ సమయానికి ఊళ్లకు వెళ్లటం ఒక అలవాటుగా ఉంది. ఈ ఎఫెక్ట్ తోనే సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. హైదరాబాద్ రోడ్లు మొత్తం ఖాళీ కావటం తెలిసిందే.

ఈ సంక్రాంతి స్పెషల్ ఏమంటే.. పెద్ద పండగకు ఐదారురోజుల ముందుగానే స్థానిక ఎన్నికల పండుగకు తెర తీస్తారని చెబుతున్నారు. ఏపీలో స్థానిక సంస్థలకు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంది. దీని షెడ్యూల్ ను జనవరి 9.. 10 తేదీల్లో ప్రకటించే వీలుందని చెబుతున్నారు. తొలుత ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాత పంచాయితీ ఎన్నికలు జరిగే అవకాశముంది.

ఏపీ పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం ఆయా పదవుల పదవీకాలం ముగిసే లోపు ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి సమాచారాన్ని అందించాల్సి ఉంది. కానీ.. 2018 ఆగస్టులోనే సర్పంచ్ ల పదవీ కాలం పూర్తి అయ్యింది. ఈ ఏడాది (2019) జూన్ లోనే ఎంపీటీసీలు.. జెడ్పీసీలు.. ఎంపీపీ.. జెడ్పీ ఛైర్మన్ల పదవీ కాలం ముగిసింది.
అయినప్పటికీ నాడు అధికారంలో ఉన్న బాబు ప్రభుత్వం ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు పూర్తి చేయకుండా ఆలస్యం చేసింది. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరగటంతో స్థానిక సంస్థలకు ఎన్నికల్ని నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఇటీవల హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతికి కాస్త ముందుగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో స్థానిక ఎన్నికల పండుగ షురూ కానుందని చెప్పక తప్పదు.