Begin typing your search above and press return to search.

భాగ్యనగరిలో యాచకుల సంపాదన ఎంతంటే..?

By:  Tupaki Desk   |   22 Nov 2016 3:57 AM GMT
భాగ్యనగరిలో యాచకుల సంపాదన ఎంతంటే..?
X
రోడ్డు పక్కన.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరా.. బస్టాండ్.. రైల్వేస్టేషన్.. దేవాలయాలు.. షాపింగ్ మాల్.. పర్యాటక ప్రాంతాలు.. ఇలా ఎక్కడైనా సరే కుప్పలు కుప్పలుగా కనిపిస్తూ.. దీనాతి దీనంగా తమ కష్టాలు చెప్పుకుంటూ కనిపించే బిచ్చగాళ్లు చాలామందే కనిపిస్తారు. నెలలు నిండని చంటిపిల్లల్ని భుజాన ఎత్తుకొని అత్యంత దీనంగా యాచకత్వం చేస్తుంటారు. వారిని చూసినంతనే అయ్యో పాపం.. అనిపించి వెంటనే డబ్బులు వేసే పరిస్థితి.

హైదరాబాద్ మహానగరంలో బిచ్చగాళ్లు లేని నగరంగా మార్చాలన్న ఉద్దేశంతో జీహెచ్ఎంసీ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. బెగ్గర్స్ ఫ్రీసిటీ పేరిట స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ లోని బిచ్చగాళ్లకు సంబంధించిన వివరాల్ని.. వారి ఆదాయాల్ని.. వారేం చేస్తుంటారు? లాంటి అంశాల మీద కొన్ని సర్వేలు నిర్వహించారు. ఈ సర్వే వివరాలు వింటే షాకింగ్ గా అనిపించక మానదు.

హైదరాబాద్ సిటీలో మొత్తంగా 20వేల మంది యాచకులు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. వీరి రోజువారీ ఆదాయం అక్షరాల రూ.75 లక్షలు. వార్షికఆదాయం రూ.270కోట్లుగా లెక్క తేల్చారు. మొత్తం బిచ్చగాళ్లలో 90 శాతం మంది నకిలీ బిచ్చగాళ్లుగా అధికారులు తేల్చారు. పని చేసే శక్తి ఉన్నప్పటికీ అయాచితంగా వచ్చే ఆదాయాన్ని వదులుకోలేక బిచ్చం ఎత్తుకునే పనిలో బిజీగా ఉండే వారే ఎక్కువగా తేల్చారు.

అనారోగ్యంతో.. ఏ మాత్రం పని చేయలేక.. మరో దారి లేక బిచ్చం ఎత్తుకోవటం మినహా మరో దారి లేని వారు.. మొత్తం 20వేల మందిలో వెయ్యి మంది కూడా ఉండరని పలు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. బిచ్చగాళ్లను అడ్డం పెట్టుకొని దందా చేస్తున్న ముఠాలు హైదరాబాద్ సిటీలో దాదాపు 200 వరకు ఉన్నట్లుగా చెబుతున్నారు. పేద కుటుంబాలకు అప్పులు ఇచ్చి.. ఆ అప్పుల్ని తీర్చేందుకు వీలుగా చంటిపిల్లల్ని పంపాలని ఒత్తిడి చేస్తూ.. తమ పని తాము చేసుకుపోతున్నారు.

ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే.. అడుక్కోవటం కోసం వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. కొంతమంది బిచ్చగాళ్లు అయితే ఫుల్ టైం ఈ పని చేయకుండా పార్ట్ టైం ఈ పనిని చేస్తున్నారు. ఈ పనిలో శ్రమ తక్కువగా ఉండటం.. ఆదాయం ఎక్కువగా ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరో షాకింగ్ అంశం ఏమిటంటే.. తాము సంపాదించే సంపాదనలో బిచ్చగాళ్లు మద్యం.. మత్తుపదార్థాల కోసం40 నుంచి 45 శాతం ఆదాయాన్ని ఖర్చు చేస్తుంటారు. ఆహారం కోసం వారు కేవలం 20 శాతం మాత్రమే ఖర్చు చేస్తుంటారు. ఇక.. తాము సంపాదించిన సంపాదనను కొందరు బ్యాంకుల్లో జమ చేసుకుంటుంటే.. మరికొందరు అధిక వడ్డీలకు అప్పలు ఇస్తున్న వైనం కూడా ఉన్నట్లుగా తేల్చారు.

బిచ్చగాళ్లుగా బలవంతంగా తిప్పే చిన్నారులకు రోజుకు రూ.500 ఇస్తారట. ఇక అడుక్కునే మహిళల్లో కొందరు పొద్దున యాచకత్వం చేసి.. రాత్రివేళ సెక్స్ వర్కర్లుగా పని చేసే వారు కూడా ఉన్నారట. యాచకులకు తాము ఉపాధి సౌకర్యాలు అందిస్తామని.. అనాథ శరణాలయాల్లో చేరుస్తామని కొన్ని సేవా సంఘాలు ప్రయత్నిస్తే.. వారుఅందులో చేరటానికి ఏ మాత్రం సుముఖంగా లేకపోవటం గమనార్హం. బిచ్చగాళ్లకు సంబంధించిన ఇలాంటి షాకింగ్ అంశాలున్న నేపథ్యంలో.. కంటి ముందు కనిపించే బిచ్చగాళ్లకు చిల్లర వేయాలా? లేదా? అన్నది మాత్రం మీ ఇష్టం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/