Begin typing your search above and press return to search.

కేటీఆర్ సైలెంట్ అవ్వడం వెనుక ఆ అంతులేని బాధ

By:  Tupaki Desk   |   23 Dec 2022 5:04 PM GMT
కేటీఆర్ సైలెంట్ అవ్వడం వెనుక ఆ అంతులేని బాధ
X
సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదే మిగిలింది. కానీ తెలంగాణలో రాజకీయం ఇప్పుడే వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు హద్దులు దాటుతుండడంతో ఎన్నికల వాతావరణం ఏర్పడినట్లవుతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరుష వ్యాఖ్యలు వాడడం ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ లో నెంబర్ 2 గా ఉన్న కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఘాటు విమర్శలు చేశారు. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ ని డ్రగ్స్ ఆరోపణలు నిరూపిస్తావా..? చెప్పు దెబ్బలు తింటావా...? అని అన్నారు. అయితే ఇదంతా ఇంట్లో, పార్టీలో జరుగుతున్న పరిస్థితులపై ప్రస్టేషనా..? అని కొందరు అంటున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ స్థాపన.. మరోవైపు కవిత లిక్కర్ స్కాం గొడవతో .. కేటీఆర్ లో ఓపిక నశించిందని అంటున్నారు. దీంతో ఆయన ఎడాపెడా మాటలు విసురుతున్నారని చర్చించుకుంటున్నారు. కౌంటర్లు కూడా గట్టిగా రావడంతో వాటిని ఎదుర్కోలేక.. ఆ తలవంపులు తట్టుకోలేక ఇటీవల సైలెంట్ అయిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏడాది వ్యాప్తంగా బీఆర్ఎస్ లో లుకలుకలు కనిపిస్తున్నాయి. కేంద్రంతో బీఆర్ఎస్ పెట్టుకున్న పోరుతో రాష్ట్ర బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ఆ పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీలో కీలక నాయకుడైన కేటీఆర్ ను వదిలిపెట్టలేదు. కేటీఆర్ కు డ్రగ్స్ అలవాటు ఉందని, ఆయనకు డ్రగ్స్ సరఫరా చేసే వారితో సంబంధాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు సంజయ్ ఆరోపించారు. అంతేకాకుండా రక్త నమూనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా..? అని సవాల్ చేశారు.

అయితే ఈ ఆరోపణలు చేసి చాలా కాలమైంది. కానీ కేటీఆర్ ఇప్పుడు స్పందించడం ఆసక్తిగా మారింది. కేటీఆర్ ఇప్పుడు రియాక్ట్ కావడంపై ఆయనలో పెరిగిన ప్రస్టేషనే కారణమని అంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం కేటీఆర్ కు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అందుకే ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన కనిపించలేదు. మరోవైపు ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో పదే పదే వినబడడం ఆయనలో అసహనాన్ని పెంచాయని అంటున్నారు. ఇవి చాలవని టీఆర్ఎస్ మంత్రులపై ఈడీ రైడింగ్స్ తో కేటీఆర్ లో టెన్షన్ పెరిగిపోతుంది.

ఈ పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీని రెచ్చగొట్టడం ద్వారా ఆ పార్టీ నాయకులు చేసే పరుష పదజాలంపై ప్రజల్లో విమర్శిస్తోంది. దీంతో సాధారణ జనంలోనూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కామెంట్లను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే బీఆర్ఎన్ ను ఇరుకున పెట్టేందుకు రాష్ట్ర బీజేపీ సక్సెస్ అయిందని అంటున్నారు. ఇన్నాళ్లు శాంత మూర్తిగా ఉన్న కేటీఆర్ తోనూ పరుష వ్యాఖ్యలు పలికించిన బీజేపీ నాయకులు రాను రాను మరెన్ని ఎత్తుగడలు వేస్తారోనని అంటున్నారు.

ఉన్నత చదువులు చదివిన కేటీఆర్ పై ఇంతకాలం ప్రత్యేక అభిమానం ఉండేది. పెద్దాయన కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ మాత్ర హుందాగా విమర్శలు చేసేవారు. కానీ ఆయన తాజాగా సిరిసిల్లలో కేటీఆర్ వాడిన పదజాలం.. పడిన ఆవేదన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మరింత రెచ్చిపోయే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. అయితే ఇలాంటి పదజాలంతోనే ఓట్లు రాలుతాయని అనుకోవడం పొరపాటేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ పై అసంతృప్తి నెలకొంటున్న సమయంలో కేటీఆర్ లాంటి నాయకులు ఇలాంటి పదజాలం వాడడం.. తర్వాత కౌంటర్లు పడి సైలెంట్ అయిపోవడం పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.