Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య వెనక.. సంచలన విషయాలెన్నో... ?

By:  Tupaki Desk   |   27 Feb 2022 10:36 AM GMT
వైఎస్ వివేకా హత్య వెనక.. సంచలన విషయాలెన్నో... ?
X
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి అయి ఇప్పటికి మూడేళ్ళు కావస్తోంది. 2019 మార్చి 14 అర్ధరాత్రి దారుణంగా ఆయన పులివెందులలోని తన ఇంట్లోనే హత్యకు గురి అయ్యారు. వైఎస్ వివేకా హత్య వెనకాల ఎవరున్నారు అన్నది సీబీఐ ఇప్పటికే విచారణ జరుపుతోంది. దీని మీద రాజకీయ పార్టీలు కూడా ఎవరికి తోచిన తీరున వారు కామెంట్స్ చేస్తున్నాయి. అయితే నిజాలు బయటకు వచ్చేంతవరకూ, సీబీఐ అధికారిక ప్రకటన చేసేంతవరకూ కూడా ఎవరైనా సంయమనం తోనే ఉండాలి.

ఇవన్నీ ఇలా ఉంటే వైఎస్ వివేకా అంటే సామాన్యమైన మనిషి కారు. ఆయన మంత్రిగా పనిచేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేస్తూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. పైగా ఆయనది రాజకీయ కుటుంబం, ఒక సీఎంకి తమ్ముడు, ప్రస్తుత సీఎంకి బాబాయ్. అలాంటి రాజకీయ ప్రముఖుడి హత్య విషయంలో వాస్తవాలు ఇన్నేళ్ళు గడచినా తెలియకపోవడం మాత్రం బాధాకరమే కాదు దారుణం కూడా.

ఇక వివేకా అంటే కేరాఫ్ పులివెందుల. వివేకా అంటే అక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే పెద్ద దిక్కు. ఆయనకు భేషజాలు లేవు, నిరాడంబరుడు. తన దగ్గరకు వచ్చిన వారి కష్టం తీర్చడానికి ఆయనే స్వయంగా వారిని తీసుకుని అధికారుల వద్దకు వెళ్తారు. వారి సమస్యకు పరిష్కారం చూపిస్తారు. అందుకే రాష్ట్రానికి వైఎస్సార్ సీఎం అయినా, జగన్ అయినా కూడా పులివెందుల మాత్రం ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం అన్నీ వైఎస్ వివేకానే.

మరి ఆయనకు జనాల సమస్యలు పరిష్కరించడంలో ఎంతో ఆనందం. అందుకే అదో వ్యసనంగా మార్చుకుని ఆయన ఏళ్ల తరబడి పులివెందులలోనే అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చారు. ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ ఆయన్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. వైఎస్సార్ అంటే గిట్టని వారున్నారు, జగన్ అంటే వ్యతిరేకించేవారున్నారు, కానీ వివేకా అంటే అందరికీ ఆప్తుడే. మరి ఈ మంచితనం, జనాలను ప్రేమించేతనమే ఆయన మరణానికి కారణమా అంటే అదే పులివెందుల వాసి, టీడీపీ లాంటి ప్రత్యర్ధి పార్టీలో ఉన్నా కూడా వివేకా గొప్పతనం గురించి కితాబు ఇచ్చే నాయకుడు బీటెక్ రవి అయితే అవును అంటారు.

అసలు వివేకా ఎలా చనిపోయారు, ఆయన దారుణ హత్యకు దారి తీసిన కారణాలు ఏంటి అన్న దాని మీద ఒక చానల్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన తన మనసులొని భావాలను విప్పి చెప్పారు. వివేకానందరెడ్డికి కుటుంబానికి దాయాదులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి వంటి వారి తో విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇక కడప ఎంపీ టికెట్ మీదనే ఈ హత్య జరిగి ఉండవచ్చు అని ఆయన అంటున్నారు.

కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తమ కుటుంబంలోని వైఎస్ విజయమ్మకు కానీ, షర్మిలకు కానీ ఇవ్వాలని ఆయన సూచించారు అని బీటెక్ రవి చెప్పుకొచ్చారు. ఒక విధంగా ఆయన పట్టుబట్టారని కూడా చెబుతున్నారు. అంతే కాదు, పులివెందులలో వివేకా మాటకు తిరుగులేదు. ప్రజలంతా ఆయన వద్దకే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారు. బహుశా ఇది కూడా ఆయన అంతే గిట్టని వారికి కోపానికి కారణం అయి ఉండవచ్చు అంటున్నారు.

వివేకా హత్య విషయంలో సీబీఐ అన్ని వేళ్ళూ వైఎస్ అవినాష్ వైపు చూపిస్తూంటే తమ మీద అనవసరంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని ఆయన అంటున్నారు. నిజానికి ఈ హత్య విషయంలో సంబంధం లేదని చెప్పాలనుకుంటే అవినాష్ తన పదవికి రాజీనామా చేయవచ్చు కదా, తన నిజాయతీ నిరూపించుకుని తిరిగి పదవి పొందవచ్చు కదా అని అంటున్నారు.

ఇక వివేకా హత్య విషయం, ఎవరు చేశారు అన్నది పులివెందులో ప్రతీ చెట్టుకు, పుట్టకు, గోడకు కూడా తెలుసు అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఈ హత్య కోసం నలభై కోట్ల డీల్ అయితే పది కోట్లు ముందు ఇచ్చారని, అంత పెద్ద మొత్తం ఎక్కడ నుంచి వచ్చిందో కూడా సీబీఐ విచారణ చేయాలని, దీని వెనక బడాబాబులు ఎవరున్నారు అన్నది కూడా తేలాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

మొత్తానికి పులివెందుల అంటే వైఎస్సార్ ఒక బ్రాండ్ ని తెచ్చారని, తమ రాజకీయ ప్రత్యర్ధి అయినా వైఎస్సార్ పులివెందుల కీర్తిని ఏపీ మొత్తానికి తెలియచేశారని, ఇపుడు వివేకానందరెడ్డి మర్డర్ ద్వారా పులివెందుల పరువు పోయిందని, దీన్ని దగ్గర‌వారే చేశారు అంటే అంతకంటే పులివెందుల తలదించుకునే విషయం ఉండదని కూడా బీటెక్ రవి చెప్పడం విశేషం. మొత్తానికి వివేకా హత్య విషయంలో సీబీఐ అసలు దోషులను తొందరలో పట్టుకుంటుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తంచేయడం విశేషం.