Begin typing your search above and press return to search.

మ‌రో `చంద్రుడి`ని సృష్టిస్తోన్న చైనా!

By:  Tupaki Desk   |   18 Oct 2018 6:12 PM GMT
మ‌రో `చంద్రుడి`ని సృష్టిస్తోన్న చైనా!
X
చైనా.... దాదాపుగా ప్ర‌పంచంలో త‌యారైన ప్ర‌తి వ‌స్తువుకు న‌కిలీ త‌యారు చేయ‌గ‌ల స‌త్తా ఉన్న దేశం. బ్రహ్మ సృష్టికి మ‌నిషి ప్ర‌తి సృష్టి చేయ‌లేడేమోగానీ....మొబైల్ ఫోన్ నుంచి మెర్సెడెస్ బెంజ్ వ‌ర‌కు ....అన్నింటినీ ప్ర‌తి సృష్టించ‌గ‌ల నైపుణ్యం చైనీయుల సొంతం. చైనా....అని పిల‌వ‌గానే....నేను `చెయ్య‌నా`....అని `చైనా` రెడీగా ఉంటుంద‌ని ఓ సోష‌ల్ నానుడి. ఈ నేప‌థ్యంలో చైనా..తాజాగా చంద్రుడికి ప్ర‌తిసృష్టి చేసేందుకు పూనుకుంది. `కృత్రిమ చంద్రుడు`ని ఆకాశంలో ప్ర‌తిష్టించేందుకు చైనా రెడీ అవుతోంది. 2020నాటికి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ ద‌గ్గ‌ర చెంగ్డు న‌గ‌రంలో ప్ర‌యోగాత్మ‌కంగా ఆ చంద్రుడిని ఏర్పాటు చేయ‌బోతున్నారు. ఆకాశంలో శాటిలైట్ సాయంతో ఆ కృత్రిమ చంద్రుడిని ఏర్పాటు చేసేందుకు చైనా స‌న్నాహాలు మొద‌లుబెట్టింది. 10 నుంచి 80 కిలోమీట‌ర్ల వ‌ర‌కు విద్యుద్దీపాల అవ‌స‌రం లేకుండా ఆ కృత్రిమ చంద్రుడితో వెలుగులు నింపాల‌ని చైనా భావిస్తోంది.

చెంగ్డు ఏరోస్పేస్ అండ్ టెక్నాల‌జీ మైక్రో ఎల‌క్ట్రానిక్స్ సిస్ట‌మ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కో(సీఎఎస్సీ) చైర్మ‌న్ వూ చున్ ఫెంగ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. వాస్త‌వానికి ఈ ఐడియా చైనాది కాద‌ట‌. కాంతిని ప్ర‌తిబింబించేలా అద్దాల‌ను ఏర్పాటు చేసే ఐడియాను చైనాలో 2010లో ఓ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఓ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ ఇచ్చాడ‌ట‌. ఇన్నాళ్లూ ప‌రిశోధ‌న‌లు చేసిన త‌ర్వాత దానిపై ఓ అంచనాకు వ‌చ్చార‌ట‌. ఒరిజిన‌ల్ చంద్రుడికి 8 రెట్లు వెలుగులు విర‌జిమ్మేలా దానిని శాటిలైట్ కోట్ ఉన్న మెటీరియ‌ల్ తో ఏర్పాటు చేస్తార‌ట‌. దాని ఏర్పాటుతో చెంగ్డు న‌గ‌రంలో విద్యుద్దీపాల అవ‌స‌రం ఉండ‌ద‌ని సీఎఎస్సీ చెబుతోంది. మ‌రి, ప్రాక్టిక‌ల్ గా ఆ కృత్రిమ చంద్రుడు ఎంత‌వ‌ర‌కు వెలుగులు విర‌జిమ్ముతాడో చూడాలంటే 2020వ‌ర‌కు వేచిచూడ‌క త‌ప్ప‌దు.