Begin typing your search above and press return to search.

బెజవాడ అయ్యప్పనగర్ మహిళలకు కొత్త టెన్షన్

By:  Tupaki Desk   |   2 July 2021 3:49 AM GMT
బెజవాడ అయ్యప్పనగర్ మహిళలకు కొత్త టెన్షన్
X
వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికి ఇది నిజంగా నిజం. ఏపీలోని విజయవాడ (బెజవాడ) నగరంలోని ఒక ప్రాంతానికి చెందిన మహిళలు రాత్రి అయ్యిందంటే తెగ టెన్షన్ పడుతున్నారు. ఇక.. రాత్రిళ్లు నిద్రపోయేందుకు వారు తెగ సంశయించే పరిస్థితి. రాత్రిళ్లు నిద్రపోవటానికి అంత టెన్షన్ అంటారా? అక్కడికే వస్తున్నాం. విజయవాడలోని అయ్యప్పనగర్ మహిళలకు గడిచిన కొద్దిరోజులుగా కొత్త వణుకు మొదలైంది. బెడ్ మీదకు వెళ్లి హాయిగా పడుకున్న వారు.. ఏ అర్థరాత్రి వేళలోనో హటాత్తుగా మెలుకువ వచ్చి చూస్తే.. అపరిచిత వ్యక్తి పక్కన పడుకున్నట్లుగా గుర్తించి.. భయంతో కేకలు వేస్తున్నారు.

అప్పటివరకు పక్కనే పడుకునే వ్యక్తి.. సదరు మహిళ గావు కేకలు పెట్టి.. అందరూ వచ్చేసరికి సదరు ఆగంతకుడు పారిపోతున్నాడు. ఇంతకూ అతడెవరు. ఎందుకలా? చేస్తున్నాడన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మారింది. అర్థరాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో మహిళల పక్కన పడుకునే ఈ అపరిచితుడి పుణ్యమా అని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు తెగ ఇబ్బంది పడుతున్నారు.

కంటి మీద కునుకు తీయటం ఆలస్యం.. పక్కకు వచ్చి పడుకునే ఈ అపరితుడి కారణంగా.. ఆ ప్రాంతానికి చెందిన వారంతా రాత్రిళ్లు నిద్ర పోవటానికి సైతం టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ఈ తరహా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న మహిళలు పలువురు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అతగాడి ఆచూకీ పట్టుకునేందుకు పోలీసులు కిందా మీదా పడుతున్నారే తప్పించి.. పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడీ అపరిచితుడి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.