Begin typing your search above and press return to search.

తొలి `డబుల్‌`వీరుడు సచిన్ కాద‌ట‌!

By:  Tupaki Desk   |   21 July 2018 10:57 AM GMT
తొలి `డబుల్‌`వీరుడు సచిన్ కాద‌ట‌!
X
2010లో గ్వాలియర్ లో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాపై స‌చిన్ స‌రిగ్గా 200 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచిన ఘ‌ట్టం క్రికెట్ అభిమానుల‌కు ఇప్ప‌టికీ గుర్తుండే ఉంటుంది. త‌న‌కు త‌ప్ప మ‌రెవ్వ‌రికీ సాధ్యం కాద‌న్న రీతిలో స‌చిన్ ఆ అరుదైన ఫీట్ ను అందుకోవ‌డంతో అత‌డి అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. వ‌న్డే క్రికెట్ లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన మొట్ట‌మొద‌టి ప్లేయ‌ర్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌కు స‌గ‌టు క్రికెట్ అభిమాని ఠ‌క్కున చెప్పే స‌మాధానం స‌చిన్ టెండూల్క‌ర్. ఒక వేళ మీరు కూడా...అదే స‌మాధానం చెప్పాల‌నుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే - స‌చిన్ ఆ రికార్డు సాధించ‌డానికి 13 ఏళ్ల ముందే అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్ లో తొలి డ‌బుల్ సెంచ‌రీ సెంచ‌రీ న‌మోదైంది. 1997లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ బెలిండా క్లార్క్ 229 ప‌రుగులు సాధించి....అంత‌ర్జాతీయ క్రికెట్ లో తొలి డ‌బుల్ సాధించిన క్రికెట‌ర్ గా చ‌రిత్ర పుట‌ల‌కెక్కింది. తాజాగా - జింబాబ్వేపై పాక్ ఓపెన‌ర్ ఫ‌క‌ర్ జ‌మాన్ సాధించిన డ‌బుల్ సెంచ‌రీతో ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది.

జింబాబ్వేతో జరిగిన నాలుగోవన్డేలో పాక్ ఓపెనర్ ఫ‌క‌ర్ జ‌మాన్ డబుల్‌ సెంచరీ(210 నాటౌట్‌) సాధించిన సంగ‌తి తెలిసిందే. పాక్ తరఫున తొలి డ‌బుల్ సాధించి క్రికెట‌ర్ గా జ‌మాన్ రికార్డు సృష్టించాడు. ఈ నేప‌థ్యంలో స‌చిన్ కంటే ముందే అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఆసీస్ మ‌హిళా క్రికెట‌ర్ బెలిండా క్లార్క్ తొలి డ‌బుల్ సాధించిన వైనం వెలుగులోకి వ‌చ్చింది. 1997 - డిసెంబ‌రు 16న ముంబైలో జ‌రిగిన మ‌హిళ‌ల‌ ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్ సంద‌ర్భంగా డెన్మార్క్ పై బెలిండా క్లార్క్ తొలి డ‌బుల్ సెంచ‌రీ(229) సాధించింది. అయితే, అదే ఏడాది మే21న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భార‌త్ పై స‌యీద్ అన్వ‌ర్ 194 ప‌రుగులు సాధించి తృటిలో డ‌బుల్ చేజార్జుకోవ‌డం విశేషం. ఆ త‌ర్వాత 2010లో స‌చిన్ అంత‌ర్జాతీయ క్రికెట్ లో రెండో డ‌బుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. దీంతో, పురుషుల వన్డే క్రికెట్ లో తొలి డబుల్‌ సాధించిన క్రికెట‌ర్ గా సచిన్‌ టెండూల్కర్ రికార్డుల‌కెక్కిన‌ట్ల‌యింది. ఆ త‌ర్వాత భార‌త్ త‌ర‌ఫున‌ రోహిత్‌ శర్మ (209 - 264 - 208) మూడు డబుల్‌ సెంచరీలు - వీరేంద‌ర్ సెహ్వాగ్‌(219) డబుల్ సెంచ‌రీ సాధించిన సంగ‌తి తెలిసిందే. వీరితో పాటు కివీస్ ఓపెన‌ర్ మార్టిన్ గ‌ప్టిల్(237) - విండీస్ విధ్వంస‌క‌ర బ్యాట్స్ మ‌న్ క్రిస్ గేల్(215) - ఫ‌క‌ర్ జ‌మాన్(229) డబుల్‌ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.