Begin typing your search above and press return to search.

గాలి అనుచరుడికి టికెట్.. రచ్చ రచ్చ!

By:  Tupaki Desk   |   12 April 2018 5:06 AM GMT
గాలి అనుచరుడికి టికెట్.. రచ్చ రచ్చ!
X
ఇనుప గనుల కుంభకోణాలలో సిద్ధహస్తుడుగా బళ్ళారి కింగ్ గా పేరు పడిన గాలి జనార్దనరెడ్డికి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో మిశ్రమ అనుభవాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు కోర్టు తీర్పు కారణంగా బళ్లారిలో అడుగుపెట్టే అవకాశం కూడా లేని గాలి జనార్దనరెడ్డి ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చక్రం తిప్పాలని తహతహలాడిపోతున్నారు. బళ్లారి నగర శివార్లలో తిష్టవేసి అయినా అక్కడి రాజకీయాలను శాసించాలని కోరుకుంటున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ మాత్రం ఆయనకు ఎన్నికలలో ప్రాధాన్యం ఇవ్వడం గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకునే ఉద్దేశం లేదని ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

తనను పార్టీ దూరం పెట్టినా సరే తన సోదరుడు సోమశేఖర రెడ్డికి టికెట్ తీసుకోవాలని ఆశపడుతున్న గాలి జనార్దనరెడ్డికి ఆ విషయంలో భంగ పాటు తప్పేలా లేదు. కొందరు కొంత ఊరట ఏమిటంటే గాలి జనార్ధనరెడ్డి కీలక అనుచరుడు బి శ్రీరాములు కు ఎమ్మెల్యేగా టికెట్ లభించడమే. ప్రస్తుతం బళ్ళారి ఎంపీగా ఉన్న శ్రీరాములు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రంగంలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. తొలి జాబితాలోనే ఆయనకు టిక్కెట్ ప్రకటించారు కూడా. ఎన్నికల్లో పార్టీ నెగ్గడం అంటూ జరిగితే ఆయనకు మంత్రి పదవి కూడా గ్యారెంటీ. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీరాములు ను ఎమ్మెల్యేగా దించడం పై అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి.

ఒక శ్రీరాములు విషయంలోనే కాకుండా భారతీయ జనతా పార్టీ తొలి జాబితాలో 72 మంది పేర్లను విడుదల చేయగా చాలా నియోజకవర్గాలలో అసంతృప్తి విపరీతంగా పెరుగుతోంది. అసంతృప్తులు పార్టీ మారినా తిరుగుబాటు అభ్యర్థులుగా అయినా రంగంలోకి దిగే ప్రమాదం ఉండడంతో పార్టీ అధిష్టానం తలపట్టుకుంటోంది. అసలే పరిస్థితులు అంత సానుకూలంగా లేని నేపథ్యంలో ఈ ఆటంకాలను అధిగమించడం ఎలాగో వారికి అర్థం కావడం లేదు.