Begin typing your search above and press return to search.

ఇంగ్లండ్ దూకుడు.. టీమిండియాకు మింగుడుపడదు..

By:  Tupaki Desk   |   28 Jun 2022 11:30 PM GMT
ఇంగ్లండ్ దూకుడు.. టీమిండియాకు మింగుడుపడదు..
X
ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ సోమవారంతో ముగిసింది. వాస్తవంగా అయితే.. మన జట్లు కాదు కాబట్టి వాటి గురించి చెప్పుకోవడం ఇక్కడ అనవసరం. కానీ, చెప్పుకొని తీరాల్సిన పరిస్థితి. టెస్టు ప్రపంచ చాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్.. విదేశీ గడ్డపై తీవ్ర ప్రతిఘటన చూపగా, రెండేళ్లుగా తీవ్ర పరాభవాలను ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ సొంతగడ్డపై అదే స్థాయిలో దానిని ఎదుర్కొని విజయం సాధించింది. అది కూడా అలా ఇలా కాదు.. 3-0తో క్లీన్ స్వీప్ చేసి మరీ.. అంతేకాదు.. మూడు టెస్టుల్లోనూ నాలుగో ఇన్నింగ్స్ లో 275 పరుగుల పైగా లక్ష్యాన్ని ఛేదించింది.

ఇది మామూలు ఘనత కాదు.. ఓ దశలో మూడు టెస్టుల్లోనూ ఓడిపోయేలా కనిపించిన ఇంగ్లండ్.. బ్యాట్స్ మెన్ తిగించి ఆడడంతో పుంజుకొంది. తద్వారా జులై 1 నుంచి టీమ్‌ఇండియాతో ఆడే కీలక మ్యాచ్‌కు ముందు గొప్ప ఆత్మవిశ్వాసం సంపాదించుకుంది. ఇక కీలక ఆటగాళ్లు జోరూట్‌, బెయిర్‌స్టో, కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ ఫామ్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే స్టోక్స్‌ మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తాము ఎలా ఆడామో టీమ్‌ఇండియాతో అదే విధంగా దూకుడుగా ఆడతామని చెప్పాడు. కివీస్‌పై ఏయే విభాగాల్లో రాణించామో వాటిపై మరింత దృష్టిసారిస్తామని చెప్పాడు. దీంతో టీమ్‌ఇండియాపై విజయం సాధిస్తామని స్టోక్స్‌ ధీమా వ్యక్తం చేశాడు.

ఇది మామూలు విజయం కాదు..

న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు ముందు ఇంగ్లాండ్‌ గత 17 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. డిసెంబరు-జనవరిలో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ను దారుణంగా 4-1తో కోల్పోయింది. మార్చిలో వెస్టిండీస్‌ పర్యటనలోనూ టెస్టు సిరీస్‌ చేజార్చుకుంది. దీంతో రూట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. స్టోక్స్‌ సారథిగా ఎంపికై స్వదేశంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌ను చిత్తు చేశాడు.తమ ఆటగాళ్లు గొప్పగా పుంజుకున్నారని, ఇలాంటి పట్టుదలతోనే టీమ్‌ఇండియాతోనూ ఆడతామని స్టోక్స్‌ వివరించాడు.

మూడు టెస్టుల్లోనూ వెనుకబడి

న్యూజిలాండ్ తో మూడు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ మొదట వెనుకబడి తర్వాత పుంజుకొని గెలిచింది. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థిని 131 పరుగులకు ఆలౌట్ చేసినా ఇంగ్లండ్
142 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 285 పరుగులు చేస్తే ఇంగ్లండ్ కు 278 పరుగుల టార్గెట్ ఎదురైంది. ఈ క్రమంలో 69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి
పరాజయానికి దగ్గరైంది. కానీ రూట్ (115 నాటౌట్), స్టోక్స్ (54) అద్భుతంగా ఆడి గెలిపించారు. ఇక రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఏకంగా 553 పరుగులు చేసింది. రూట్
(176) మరోసారి శతకం బాదడంతో ఇంగ్లండ్ 539 పరుగులు సాధించింది.

రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 284 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ విజయానికి 298 పరుగులు చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇంగ్లండ్ 93 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోగా.. బెయిర్ స్టో (136) సుడిగాలి సెంచరీతో గెలిపించాడు. ఇక మూడో టెస్టులో కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేస్తే ఇంగ్లండ్ 360 పరుగులకు ఆలౌటైంది. వాస్తవానికి 55 పరుగులకే ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. కానీ, బెయిర్ స్టో (162) వీర బాదుడు, పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ ఓవర్టన్ (97) రాణింపుతో గట్టెక్కింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 326 పరుగులు చేసింది. 296 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి మాత్రమే అందుకుంది.

టీమిండియా పారాహుషార్...

ప్రస్తుతం ఇంగ్లండ్ వన్డేలను టి20లుగా, టెస్టులను వన్డేలుగా ఆడుతోంది. న్యూజిలాండ్ ను ఏవిధంగా ఓడించిందో అందరూ చూశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మరింత మెరుగ్గా ఆడితేనే ఆ జట్టుపై పై చేయి సాధించగలదు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ కొవిడ్ బారినపడడం, కెప్టెన్ గా ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి, కోహ్లి ఫామ్ లో లేకపోవడం, టెస్టు ఆడి చాలా రోజులు కావడంతో టీమిండియా ఎలా బదులిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇంగ్లండ్ ఫామ్ చూస్తేనేమో భీకరంగా ఉంది. మరి.. ఈ సవాల్ ను అధిగమించాలంటే టీమిండియాకు కష్టమే.