Begin typing your search above and press return to search.

అసలైన ప్రపంచ విజేతలా ఆడిన ఇంగ్లండ్!

By:  Tupaki Desk   |   26 Aug 2019 7:29 AM GMT
అసలైన ప్రపంచ విజేతలా ఆడిన ఇంగ్లండ్!
X
తొలి ఇన్నింగ్స్ లో కేవలం అరవై ఏడు పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత ఏ జట్టు అయినా ఆ టెస్టు మ్యాచ్ లో విజయం సాధిస్తుందని ఎవ్వరూ అనుకోరు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంత పేలవమైన ప్రదర్శన చేసిన బ్యాట్స్ మన్ రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేధించగలరని ఏ క్రికెట్ పండితుడు కూడా ఊహించలేడు. అలాంటి ఊహలకు అందని విజయాన్ని సాధించింది ఇంగ్లండ్ జట్టు. ఇటీవలే అనూహ్యంగా ప్రపంచకప్ విజేతగా నిలిచిన బ్రిటీష్ జట్టు యాషెస్ సీరిస్ లో మూడో టెస్టును అద్భుత రీతిలో గెలుచుకుంది.

ఈ మ్యాచ్ లో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. నూటా డెబ్బై తొమ్మింది పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయ్యింది. తన తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లిష్ జట్టు కేవలం అరవై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయ్యి - ఆస్ట్రేలియాకు ఆధిక్యాన్ని ఇచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ఫర్వాలేదనిపించుకునే స్కోర్ చేసింది. స్థూలంగా ఇంగ్లండ్ కు మూడు వందల యాభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

సాధారణంగా టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్ గా బ్యాటింగ్ చేసే జట్టు భారీ లక్ష్యాలను చేధించలేదు. కనీసం రెండు వందల పరుగుల లక్ష్యాన్ని చేధించడం కూడా సులభం కాదు. అప్పటికే పిచ్ కు వచ్చే పగుళ్లతో బ్యాట్స్ మన్ నిలబడటం కష్టం అవుతుంది.

అందులోనూ తొలి ఇన్నింగ్స్ లో అరవై తొమ్మిది పరుగులకే అలౌట్ అయిన జట్టు. మూడు వందల అరవై పరుగులు కొట్టగలదని ఎవరూ అనుకోలేరు. అలాంటి అసాధ్యం అనిపించే లక్ష్యాన్నే సుసాధ్యంగా సాధించారు ఇంగ్లండ్ బ్యాట్స్ మన్. బెన్ స్ట్రోక్స్ సెంచరీతో రాణించగా - జో రూట్ డెబ్బై ఏడు పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం ఒక్క వికెట్ మిగిలి ఉన్న దశలో ఇంగ్లిష్ జట్టు చేదనను పూర్తి చేసింది. అద్భుతమైన ఆటకు గానూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ విజయంతో సీరిస్ ను ఇంగ్లండ్ సమం కూడా చేసింది.