Begin typing your search above and press return to search.
ఇదో లెక్క: జగన్ కు ప్లస్.. కేసీఆర్ కు మైనస్
By: Tupaki Desk | 2 July 2021 1:30 PM GMTఅందుకే అంటారు మితిమీరిన ఆవేశం ఏ మాత్రం మంచిది కాదని. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న జలవివాదం ఇష్యూలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తున్న వారు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తన రాజకీయాలకు అనుగుణంగా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం.. భావోద్వేగ రాజకీయాలకు తెర తీయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత పట్టు ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గతంలో మాదిరి తానేం మాట్లాడితే.. అందుకు ప్రతిగా తెలంగాణ సమాజం భావోద్వేగంతో ఊగిపోతుందన్న భ్రమలో కేసీఆర్ ఉన్నారు. కానీ.. ఆయన రాజకీయాన్ని ఏడేళ్లుగా చూస్తున్న తెలంగాణ ప్రజలు తాజా నీటి లొల్లి వేళ పెద్దగా స్పందించలేదన్నది మర్చిపోకూడదు. ఎప్పటిలానే తాను అక్రమ ప్రాజెక్టులు.. ఏపీ పాలకుల దుర్మార్గం అన్నంతనే తన వైపుకు మొత్తం తిరిగిపోతారన్న భ్రమలతో ఉన్న ఆయన.. తొందరపాటుతో ఇటీవల కాలంలో తనకు దన్నుగా నిలిచిన సీమాంధ్ర ప్రాంతీయుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా కేసీఆర్ కు నష్టమేనని చెబుతున్నారు.
దీనికి తోడు.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస ఉండటం.. నిబంధనలకు విరుద్ధంగా జల విద్యుదుత్పత్తి చేస్తూ తొండి మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ తీరును తెలంగాణ సమాజం సైతం తప్పు పడుతోంది. విడిపోయి కలిసి ఉందామనే నినాద స్ఫూర్తికి తాజా తీరు గొడ్డలి పెట్టు లాంటిదని.. ఇలాంటి కయ్యాలు తెలుగు రాష్ట్రాల ఎదుగుదలకు ఏ మాత్రం మంచిది కాదన్న మాట తెలంగాణ ప్రజల నోటి నుంచి వస్తోంది.
విభజన సందర్భంగా తెలంగాణకు జరిగిన మేలు.. ఏపీకి జరిగిన నష్టాన్ని వారు అంతర్గత సంభాషణల్లో ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా కుంగిపోయిన ఏపీకి చేతనైనంత సాయం చేయాల్సిన అవసరం తెలంగాణ మీద ఉందని.. తెలుగు వారంతా బాగుండాలన్న ఆలోచనలో పాలకులు ఉండాలే కానీ.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మందిని బలిపెట్టే కేసీఆర్ తీరును తప్పు పడుతున్నారు. జల వివాదం విషయంలో కేసీఆర్ టీం చెలరేగిపోవటం.. అందుకు భిన్నంగా ఏపీలోని జగన్ టీం ఆచితూచి అన్నట్లు రియాక్టు కావటం తెలంగాణ ప్రజల్ని అమితంగా ఆకర్షించింది.
అన్నేసి మాటలు అంటున్నా.. సంయమనం పాటిస్తున్న జగన్ తీరును పలువురు ప్రస్తావిస్తున్నారు. దివంగత మహా నేత వైఎస్ ను ఉద్దేశించి నరరూప రాక్షసుడున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాటకు తెలంగాణ ప్రజలెవరూ కనెక్టు కాకపోవటమే కాదు.. లేని మనిషి గురించి అంత దారుణమైన వ్యాఖ్య ఎలా చేస్తారంటూ టీఆర్ఎస్ లోని కొందరు నేతలు లోగుట్టుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తనను.. తన తండ్రిని అన్నేసి మాటలు ఉంటున్నా.. తెలంగాణలో ఉన్న ఏపీ వారి కోసం భరిస్తున్నట్లుగా చేసిన జగన్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ కు భారీ డ్యామేజ్ గా మారినట్లు చెబుతున్నారు. జగన్ తీరు కలుపుకునేలా ఉంటే.. కేసీఆర్ తీరు తెంచుకునేలా ఉందని చెబుతున్నారు. మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ పక్షాన నిలిచింది ఏపీవాసులే అన్న విషయాన్ని గుర్తు చేస్తున్న వారు.. వైఎస్ మీద అంటున్న మాటలు వారి మనోభావాల్ని దెబ్బ తీస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి మాట్లాడిన కేసీఆర్ కు నష్టాన్ని చేకూరేలా చేస్తే.. జగన్ కు ప్రదర్శించిన వ్యూహాత్మక మౌనం లాభంగా మారిందన్న మాట వినిపిస్తోంది.