Begin typing your search above and press return to search.

కింగ్ ఖాన్ కు లిఫ్ట్ ఇచ్చిన దీదీ!

By:  Tupaki Desk   |   16 Nov 2017 3:54 PM GMT
కింగ్ ఖాన్ కు లిఫ్ట్ ఇచ్చిన దీదీ!
X
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు కోల్ క‌తాతో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉన్న సంగ‌తి తెలిసిందే. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు య‌జ‌మాని అయిన షారుక్ ఐపీఎల్ మ్యాచ్ ల వ‌ల్ల కోల్ క‌తావాసుల‌తో మ‌మేక‌మైపోయాడు. ముంబై త‌ర్వాత కోల్ క‌తాను త‌న హోమ్ టౌన్ గా షారుఖ్ భావిస్తాడంటే అతిశ‌యోక్తి కాదు. ఖాళీ స‌మ‌యం దొరికితే షారుఖ్ కోల్ క‌తాలో వాలిపోతాడు. ప్ర‌స్తుతం కోల్ కతాలో జ‌రుగుతున్న‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమానికి షారుఖ్ వెళ్లాడు. ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రై ముంబై తిరిగి వెళ్తున్న షారుఖ్ కు ఓ ప్ర‌ముఖ వ్య‌క్తి త‌న కారులో లిఫ్ట్ ఇచ్చారు. షారుఖ్ కూడా ఆ వ్య‌క్తి చిన్న కారులో విమానాశ్ర‌యానికి చేరుకొన్నాడు. లిఫ్ట్ ఇచ్చినందుకు ఆ వ్య‌క్తికి షారుఖ్ పాదాభివంద‌నం కూడా చేశాడు. లిఫ్ట్ ఇచ్చినందుకే షారుఖ్ పాదాభివంద‌నం చేసేంత గొప్ప‌ వ్య‌క్తి ఎవ‌ర‌ని కంగారు ప‌డ‌కండి. ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు....పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

బాలీవుడ్ బాద్షాహ్ షారుక్ ఖాన్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. దీదీని షారుఖ్ త‌న సొంత అక్క‌లాగా భావిస్తాడు. మమత అంటే త‌న‌కు చాలా అభిమానం, గౌరవం ఉన్నాయ‌ని కింగ్ ఖాన్ చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు. కోల్ క‌తాలో జ‌రుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమానికి హాజ‌రైన షారుఖ్ ను మమతా బెనర్జీ స్వయంగా తన శాంట్రో కారులో ఎయిర్ పోర్టు వద్ద డ్రాప్ చేశారు. కారు దిగిన వెంట‌నే షారుఖ్‌.....దీదీ కాళ్లకు నమస్కరించి విమానాశ్రయంలోకి వెళ్లిపోయాడు. ఇంత చిన్న కారులో చాలా కాలం తర్వాత ప్రయాణించడం ఎలా ఉందంటూ ఫారుఖ్ ను మీడియా ప్రశ్నించింది. అయితే, షారుఖ్ మాత్రం ఎలాంటి కామెంట్ చేయకుండానే విమానాశ్ర‌యం లోపలకు వెళ్లిపోయాడు. షారుఖ్ పాదాభివంద‌నం చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. స్టార్ గా ఎంత ఎదిగినా షారుఖ్ ఒదిగి ఉంటాడ‌ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.