Begin typing your search above and press return to search.

బాబు జగన్ ఒక్కటేనా : మమతమ్మ కలిపింది ఇద్దరినీ...?

By:  Tupaki Desk   |   12 Jun 2022 5:30 AM GMT
బాబు జగన్ ఒక్కటేనా : మమతమ్మ కలిపింది ఇద్దరినీ...?
X
ఏపీ రాజకీయాలను ఆ మాత్రం ఈ మాత్రం తెలిసిన వారికి జగన్ చంద్రబాబు అంటే ఉప్పూ నిప్పూ అనే అనేస్తారు. కలలో కూడా ఈ ఇద్దరు నేతలూ కలుసుకున్న సందర్భాలు ఉండవు. ఇక అదీ తప్పదు అనుకుంటే అసెంబ్లీ సమావేశాల‌లోనే మొక్కుబడిగా  వారు కలిసేవారు. కానీ ఇపుడు ఆ ముచ్చట కూడా లేదు. బాబు అసెంబ్లీకి బాయ్ కాట్ అనగానే ఈ సీన్ కూడా చూసే భాగ్యం ఏపీ జనాలకు లేకుండా పోయింది.

ఇక ఇద్దరి పొలిటికల్ ఫిలాసఫీ కూడా వేరు. జగన్ దూకుడుతో ఉంటే బాబు వ్యూహాలతో జోరు చేస్తారు. మరి అలాంటి ఈ ఇద్దరు నేతలూ ఒక్కటీ అని ఒకే గాటకు బెంగాల్ మమతమ్మ కట్టేశారు. ఏ విషయంలో ఇద్దరూ ఒక్కటీ అంటే బీజేపీని సమర్ధించే విషయంలో అని మమతమ్మ నిశ్చితాభిప్రాయం. బాబు బీజేపీతో మైత్రిని కోరుకుంటున్నారు. ఇక జగన్ అయితే ఢిల్లీతో దోస్తీ అని అంతా అంటారు.

ఇలా ఈ ఇద్దరు నేతలూ చెప్పకపోయినా పెదవి విప్పకపోయినా కూడా ఈ విషయంలో మాత్రం ఒకే రూట్లో ఉన్నారని అంతా భావిస్తారు. మరి రాజకీయం రంగు రుచి వాసన అంతా తెలిసిన మమతమ్మ సహా బీజేపీ యాంటీ విపక్షాలు పసిగట్టి కనిపెట్టడంలో వింత ఏముంది.

అందుకే మమతమ్మ ఈ ఇద్దరినీ పక్కన పెట్టేశారు. ఈ నెల 15న మమతమ్మ ఢిల్లీలో ఒక మీటింగ్ పెడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపధ్యంలో ఎన్డీయే ప్రతిపాదించే అభ్యర్ధికి వ్యతిరేకంగా బీజేపీయేతర పక్షాలు గట్టి అభ్యర్ధిని నిలబెట్టాలని చూస్తున్నారు. ఆ విషయం మీద చర్చించేందుకు మమతమ్మ ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

అందుకు గానూ ఆమె దేశంలోని బీజేపీకి సంబంధం లేని అందరి విపక్ష నేతలకు లేఖలు రాశారు. అలా మమత లేఖను అందుకున్న వారిలో తెలంగాణా సీఎం కేసీయార్ కూడా ఉన్నారు. కానీ ఏపీ నుంచి అధికార విపక్ష నాయకులు అయిన జగన్ చంద్రబాబు ఇద్దరికీ మమత లేఖ రాయకపోవడం విశేషం. ఎందుచేతనంటే ఈ రెండు పార్టీల ఓట్లు కచ్చితంగా ఎన్డీయే ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్ధికే పడతాయని మమతాజీ గట్టి నమ్మకం కాబోలు. మొత్తానికి చూస్తే మమత బాబుని జగన్ ని కలిపేశారు. మెల్లగా ఒకే గొడుకు కిందకు తెచ్చేశారు అనుకోవాలి.