Begin typing your search above and press return to search.

అయ్యో.. మ‌మ‌తకు ఇన్ని క‌ష్టాలా?

By:  Tupaki Desk   |   28 Aug 2022 7:54 AM GMT
అయ్యో.. మ‌మ‌తకు ఇన్ని క‌ష్టాలా?
X
వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి దేశ‌వ్యాప్తంగా త‌న పార్టీని విస్త‌రించి దేశ ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు క‌న్న ఆల్ ఇండియా తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీ త్రిపుర రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు అబ్దుల్ బాసిత్ ఖాన్ టీఎంసీకి రాజీనామా చేశారు. ఉపాధ్యక్ష ప‌ద‌వికి మాత్ర‌మే కాకుండా ఆయ‌న పార్టీకి కూడా రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే తాను రాజీనామా చేస్తున్నాన‌ని అబ్దుల్ బాసిత్ ఖాన్ త‌న రాజీనామాలో తెలిపారు.

ప‌శ్చిమ బెంగాల్లో మొద‌టిసారి గెలిచి ముఖ్య‌మంత్రి అయ్యాక మమ‌తా బెన‌ర్జీని వివిధ రాష్ట్రాల్లో విస్త‌రించారు. వివిధ పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నేత‌ల‌ను పార్టీలో చేర్చుకున్నారు. వారిని ప‌శ్చిమ బెంగాల్ నుంచి రాజ్య‌స‌భ‌కు పంపి తాయిలాలు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ముఖ్యంగా ప‌శ్చిమ బెంగాల్ స‌రిహ‌ద్దు రాష్ట్రాలైన త్రిపుర‌, జార్ఖండ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మేఘాల‌య తదిత‌ర రాష్ట్రాల్లో తృణ‌మూల్‌ను విస్త‌రించారు. అంతేకాకుండా గోవాలోనూ తృణ‌మూల్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ రాష్ట్రాల‌న్నింటిలోనూ త్రిపుర‌లోనే తృణ‌మూల్ కాస్త బ‌లంగా ఉంది.

వ‌చ్చే ఏడాది (2023) త్రిపుర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ప్ర‌స్తుతం బీజేపీ అధికారంలో ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో 27 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన తృణ‌మూల్ ఒక్క చోటా గెల‌వ‌లేక‌పోయింది. ఒక్క శాతంలోపే ఓట్లే సాధించింది. అయితే ప్ర‌స్తుతం ఆ పార్టీ బాగానే బ‌ల‌ప‌డింది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో త్రిపుర టీఎంసీ ఉపాధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ ఖాన్ రాజీనామా చేయ‌డం పెద్ద దెబ్బేన‌ని చెబుతున్నారు.

కాగా ఇటీవ‌లే టీఎంసీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా సుబల్ భౌమిక్‌ని మ‌మ‌తా బెన‌ర్జీ తొలగించారు. ఇంత‌లోనే ఉపాధ్యక్షుడు బాసిత్‌ ఖాన్‌ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, సుబల్‌ భౌమిక్‌ను పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొలగించడంపై మ‌మ‌తా బెన‌ర్జీ ఎటువంటి కారణం చెప్పలేదు. ఈ నేప‌థ్యంలో ఉపాధ్యక్ష ప‌ద‌వికి అబ్ధుల్ బాసిత్ ఖాన్ రాజీనామా వ్య‌వ‌హారం ఆ పార్టీలో క‌ల్లోలం సృష్టిస్తోంది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉండగా.. ఆయ‌న రాజీనామా టీఎంసీకి, మమతా బెనర్జీకి బిగ్ షాకేన‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల ఉపాధ్యాయుల నియామ‌కాల కుంభ‌కోణంలో తృణ‌మూల్ కాంగ్రెస్ మంత్రి పార్థా చ‌ట‌ర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఆయ‌న సన్నిహితురాలు, న‌టి అర్పితా ముఖ‌ర్జీని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అరెస్టు చేసింది. 25 కోట్ల రూపాయ‌ల‌కుపైగా డ‌బ్బు, బంగారం, ఆభ‌ర‌ణాలు, విలువైన ఆస్తుల‌కు సంబంధించిన డాక్యుమెంట్లు పార్థా చ‌ట‌ర్జీ ఇంట్లో ల‌భించిన సంగ‌తి తెలిసిందే. దాని నుంచే బ‌య‌ట‌ప‌డ‌లేని స్థితిలో మ‌మ‌త ప్ర‌భుత్వం త్రిపుర ఆమెకు మ‌రింత త‌ల‌పోటును తెస్తోంద‌ని చెబుతున్నారు.