Begin typing your search above and press return to search.

బెంగాల్ మ‌రో క‌శ్మీర్ కానుందా?

By:  Tupaki Desk   |   29 April 2019 4:41 AM GMT
బెంగాల్ మ‌రో క‌శ్మీర్ కానుందా?
X
ఎన్నిక‌ల వేళ రాజ‌కీయనేత‌ల నోటి నుంచి వ‌చ్చే వ్యాఖ్య‌లు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఒక్కొక్క రాష్ట్రాన్ని జ‌యిస్తూ.. కాషాయ జెండాను ఎగుర‌వేస్తున్న క‌మ‌లనాథుల‌కు కొన్ని రాష్ట్రాలు ఒక‌ప‌ట్టాన మింగుడుప‌డ‌ని రీతిలో ఉండ‌టం తెలిసిందే. ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క త‌ప్పించి.. మిగిలిన రాష్ట్రాల్లో కాలు వేలు పెట్టే అవ‌కాశం లేక‌పోవ‌టం.. ఈశాన్యంలో ప‌శ్చిమబెంగాల్ లో పాగా వేయ‌టానికి కాషాయ పార్టీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇలాంటివేళ‌.. కొత్త రాగాన్ని అందుకున్నారు బీజేపీ నేత‌లు. మిగిలిన మాట‌లు బెంగాల్ ప్ర‌జ‌ల మీద ప్ర‌భావాన్ని చూప‌ని నేప‌థ్యంలో ఐసిస్ భూతాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి చేస్తున్న బుజ్జ‌గింపు రాజ‌కీయాల కార‌ణంగా ఉగ్ర‌వాదులు రెచ్చిపోయేందుకు అవ‌కాశం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతుంద‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌మ‌త‌ను బెంగాల్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దించి.. ఇంటికి పంప‌కుంటే ప‌శ్చిమ‌బెంగాల్ కాస్తా మ‌రో క‌శ్మీర్ అవుతుంద‌ని వారు ఆరోపించారు. మ‌మ‌త బుజ్జ‌గింపు రాజ‌కీయాల కార‌ణంగా ఐసిస్.. బెంగాల్ లో అడుగుపెట్టాల‌నుకోవ‌టం సాధ్య‌మ‌వుతుంద‌ని ఆరోపించారు బీజేపీ నేత కైలాశ్ విజ‌య్. మ‌మ‌త‌ను కానీ త్వ‌ర‌గా గ‌ద్దె దించ‌క‌పోతే.. రాష్ట్రం మ‌రో క‌శ్మీర్ గా మారుతుంద‌ని హెచ్చ‌రించారు. ఈసారి బెంగాల్ లో బీజేపీ విజ‌యం ఖాయ‌మ‌న్న ఆయ‌న‌.. మే 23 త‌ర్వాత వెలువ‌డే ఫ‌లితాల త‌ర్వాత ఓట‌మితో ఆమె ముఖం చాటుకోవ‌టం ప‌క్కా అని తేల్చి చెబుతున్నారు.

ఇటీవ‌ల ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఒక పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌టం.. అందులో బెంగాల్ లో తమ సంస్థ‌ను నెల‌కొల్పుతామ‌ని పేర్కొన‌టం తెలిసిందే. ఈ పోస్ట‌ర్ క‌ల‌క‌లం నేప‌థ్యంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. మ‌రి.. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు బెంగాలీల‌ను ఎంత‌మేర‌కు ప్ర‌భావితం చేస్తాయో ఫ‌లితాలు చూస్తే కానీ క్లారిటీ రాక మాన‌దు.