Begin typing your search above and press return to search.

వామ్మో ఈ ప్రేమేంది.. ఈ హత్యేంది?

By:  Tupaki Desk   |   22 Jan 2016 5:35 AM GMT
వామ్మో ఈ ప్రేమేంది.. ఈ హత్యేంది?
X
ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలీని పరిస్థితి. దగ్గరి వాళ్లే కాలనాగుల్లా కాటేస్తున్న రోజుల్లో ముక్కు.. ముఖం తెలీని వ్యక్తిని ప్రేమించటం.. కేవలం 20 రోజుల ప్రేమకే పెళ్లి వరకూ వెళ్లిపోవటమే కాదు.. ఇంటికి వచ్చేంత సన్నిహితం ఎంత ప్రమాదకరమన్నది తాజా ఉదంతం చెప్పకనే చెబుతుంది. ఇవాల్టి రోజుల్లో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని చెప్పే ఈ ఉదంతం దేశ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా ఫేస్ బుక్ ద్వారా పంజాబ్ కు చెందిన 31 ఏళ్ల కుసుమ్ రాణి సింగ్లాకు హర్యానాకు చెందిన 28 ఏళ్ల సుఖబీర్ సింగ్ పరిచయం అయ్యారు. ఆర్నెల్ల క్రితం వరకూ ఆమె ఢిల్లీలోని ఐబీఎంలో పని చేసేవారు. పెళ్లి అయి భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న ఆమె బదిలీ మీద బెంగళూరుకు వచ్చారు. 20 రోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా సుఖబీర్ సింగ్ పరిచయమయ్యారు. గతంలో బెంగళూరులో పని చేసిన అతగాడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. ప్రస్తుతం హర్యానాలో ఉంటున్న అతగాడి ఫ్రెండ్ రిక్వెస్ట్ కు తొలుత కుసుమ్ నో చెప్పినా తర్వాత ఓకే చేసింది.

అనంతరం వారిద్దరి మధ్య ఛాటింగ్ చాలా త్వరగా ప్రేమగా మారి.. పెళ్లి వరకూ వెళ్లింది. ఇదిలా ఉండగా మంగళవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిన అతగాడు.. ఆమె ఫ్లాట్ కు వచ్చాడు. సెక్యూరిటీ అడ్డుకుంటే కుసుమ్ ఓకే చెప్పటంతో ఫ్లాట్ లోకి అనుమతించారు. ఆ సమయంలో ఆమె రూమ్ మెట్ ఆపీసుకు వెళ్లింది.

ఇరువురి మధ్య కాసేపు మాటలు జరిగిన తర్వాత.. డబ్బు అడిగిన సుఖబీర్ మాటలతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అతడి నిజస్వరూపం తెలిసిన ఆమె.. అతడిని నో చెప్పటం.. దీంతో ఆగ్రహానికి గురైన అతడు ఆమెపై దాడి చేసి ల్యాప్ టాప్ వైరుతో ఆమెను హత్య చేశాడు. అనంతరం కుసుమ్ కు చెందిన బ్యాంక్ కార్డులు.. మొబైల్ ఫోన్లను తీసుకొని.. ఢిల్లీకి వెళ్లిపోయాడు. పోలీసుల రంగప్రవేశంతో ప్రాధమిక వివరాలు సేకరించిన పోలీసులు హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడ్ని గురుగావ్ లో అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు. పెరిగిన సాంకేతికతో చాలానే మాధ్యమాలు అందరి జీవితాల్లోకి వచ్చేశాయి. అలా అని ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మేయటం కన్నా.. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలే కానీ.. కేవలం రోజుల వ్యవధిలోనే ప్రేమ.. పెళ్లి అన్నది అంత మంచిది కాదన్నది గుర్తిస్తే మంచిది.