Begin typing your search above and press return to search.

బెంగళూరు బాధితురాలు నోరు విప్పింది

By:  Tupaki Desk   |   7 Jan 2017 6:23 AM GMT
బెంగళూరు బాధితురాలు నోరు విప్పింది
X
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన బెంగళూరు ఘటనకు సంబంధించిన బాధితురాలు బయటకు వచ్చారు. కొత్త సంవత్సరం వేళ.. స్నేహితులతో గడిపి ఆటో దిగి ఇంటికి వెళుతున్న వేళ.. టూవీలర్ మీద వచ్చిన యువకుడు నడి రోడ్డు మీదనే లైంగిక దాడికి యత్నించటం.. ఆమెను వాహనం మీద ఎక్కించుకునే ప్రయత్నం చేయటం.. ఈ దృశ్యాలన్నీ సీసీకెమేరాలో నిక్షిప్తం కావటంతో ఈ ఉదంతం బయట ప్రపంచానికి తెలిసింది. నలుగురు చూస్తున్నప్పటికీ బెంగళూరు వీధుల్లో జరిగిన ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటమే కాదు.. గార్డెన్ సిటీ పోలీసుల తీరుపై తిట్టిన తిట్టుతిట్టకుండా తిడుతున్న పరిస్థితి.

న్యూఇయర్ రోజున బెంగళూరులో జరిగిన దారుణాలపై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తున్న వేళ.. బాధిత మహిళపై లైంగిక దాడికి యత్నించిన యువకుల బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై దాడికి యత్నించిన యువకుడ్ని అయ్యప్పగా గుర్తించటమే కాదు.. బాధితురాలి ఇంటికి దగ్గర్లోని స్టోర్ లో పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

తాజాగా.. బాధితురాలిని పోలీసు అధికారులు కలిశారు. ఘటన రోజు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీశారు. దౌర్జన్యం జరిపిన యువకులతో పరిచయం ఉందా? అన్న విషయాన్ని ప్రశ్నించారు. దాడికి యత్నించిన వారిలో ఇద్దరిని తాను ఎప్పుడూ చూడలేదని బాధిత మహిళ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆరోజు ఏం జరిగిందన్న విషయాన్ని పోలీసులకు చెబుతూ.. ‘‘ఆ రోజు స్నేహితులతో కలిసి చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశా. తెల్లవారుజామున రెండు గంటల వేళలో ఆటోలో ఇంటికి వచ్చా. రోడ్డు మీద ఇంటికి నడిచి వెళుతున్నప్పుడు టూవీలర్ మీద వచ్చిన వారు దాడి చేశారు. ఒక్కసారి షాక్ తిన్నా. ఒకడు నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నేను పెనుగులాడుతున్నా. అయినా విడిచిపెట్టటం లేదు. సాయం కోసం పెద్ద పెద్దగా అరుస్తున్నా.. ఆ సమయంలో వెహికిల్ మీద నన్ను కూర్చోబెట్టాలన్న ప్రయత్నం వారు చేశారు’’ అని వెల్లడించారు.

అయితే.. అదే సమయంలో తాను వేసిన కేకలు విన్న అక్కడి ఇంటివారు లైట్లు వేయటంతో.. దుండగులు తనను కిందకు పడేసి అక్కడి నుంచి పారిపోయినట్లు బాధితురాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. మహిళపై లైంగిక దాడికి దిగిన నలుగురిని(అయ్యప్ప - లెనిన్ ఫ్యాట్రిక్ - సోమశేఖర్ - సుధీష్) పోలీసులు గుర్తించారు. స్థానిక కోర్టులో హాజరు పరచగా.. వారిని ఈ నెల పదో తేదీ వరకూ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/