Begin typing your search above and press return to search.

పీకే వ్యూహ‌క‌ర్త‌గా ఉంటేనే బెట‌రా?.. నెటిజ‌న్ల టాక్‌

By:  Tupaki Desk   |   22 July 2021 12:30 AM GMT
పీకే వ్యూహ‌క‌ర్త‌గా ఉంటేనే బెట‌రా?.. నెటిజ‌న్ల టాక్‌
X
పీకే.. ఉర‌ఫ్ ప్ర‌శాంత్ కిశోర్‌. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఈ దేశానికి ప‌రిచ‌య‌మైన యువ టెకీ. బీజేపీ ఈయ‌న‌ను వ్యూహ‌క‌ర్త‌గా రాజ‌కీయాల‌కు ప‌రిచ‌యం చేసింది. అప్ప‌టి ఎన్నిక‌ల్లో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోడీని.. దేశ ప్రధానిని చేసేందుకు వ్యూహాలు వేయ‌డంలో పీకే సేవ‌ల‌ను వినియోగించుకున్నారు.

అయితే.. త‌ర్వాత కాలంలో ఈయ‌న బీజేపీకి దూర‌మైన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపే వ్యూహంతో కిశోర్ ప‌నిచేస్తున్న విష‌య‌మూ విదిత‌మే. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌నే వాద‌న తెర‌మీద‌కి వ‌చ్చింది.

వ్యూహ‌క‌ర్త‌గా ప్రారంభ‌మైన పీకే.. బిహార్‌లో నితీష్ కుమార్ స‌ర్కారును తిరిగి అధికారంలోకి వ‌చ్చేలా చేశారు. ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీ.. ముచ్చ‌ట‌గా మూడో సారి అధికారంలోకి వ‌చ్చేందుకు కృషి చేశారు. ఇక‌, ఏపీలో చంద్ర‌బాబును గ‌ద్దె దించి.. జ‌గ‌న్‌ను అధికారంలో కూర్చోబెట్టిన ఘ‌న‌త కూడా పీకేకే ద‌క్కుతుంది.

ఇలా.. అనేక పార్టీల‌ను.. ప‌లు రాష్ట్రాల్లో అదికారంలోకి తీసుకువ‌చ్చిన‌... పీకే.. ఇప్పుడు నేరుగా రాజ‌కీయ అవ‌తారం ఎత్తేందుకు రెడీ అవుతున్నార‌నే వాద‌న‌పై అనేక‌విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌గా ఉన్న కాంగ్రెస్‌లో ఆయ‌న చేరుతార‌నే వార్త‌ల‌పై భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వ్యూహ‌క‌ర్త‌గా ఉంటేనే బెట‌ర్ అని ఎక్కువ‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక పార్టీలో నేత‌గా చేరితే.. ఆ పార్టీ లైన్ ప్ర‌కారం న‌డుచుకోవాల్సి రావ‌డంతోపాటు పులుసులో ముక్క‌లా మారిపోతార‌ని.. అంటున్నారు. అదే వ్యూహ‌క‌ర్త‌గా ఉంటే.. పార్టీకి ఎంత చ‌రిత్ర ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్ని సిద్ధాంతాలు ఉన్న‌ప్ప‌టికీ.. వ్యూహ‌క‌ర్త చెప్పిన‌ట్టు తూ.చ‌. త‌ప్ప‌కుండా న‌డుచుకోవ‌డం అనేది త‌ప్ప‌దు.

అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుంటే.. ఆ క్రెడిట్ పూర్తిగానో లేక‌..స‌గ‌మో అయినా.. వ్యూహ‌క‌ర్త‌కు ద‌క్కుతుంద‌ని అంటున్నారు. అలా కాకుండా పార్టీలో చేరితే.. పార్టీ విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. అంతా నేనే చేశాను.. అన్నా వినేవారు.. ప‌ట్టించుకునేవారు.. ఉండ‌ర‌నేది విశ్లేష‌కుల అభిప్రాయంగా ఉంది.

ఇక‌, కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితినే తీసుకుంటే.. ప్ర‌స్తుతం పార్టీ ఎదురీదుతోంది. ముఖ్యంగా మోడీ హ‌వాను త‌ట్టుకుని రాహుల్ విజ‌యం ద‌క్కించుకోవ‌డం అనేది క‌త్తిమీద సాములా మారింది. ఈ నేప‌థ్యంలో పీకేను అడ్డు పెట్టుకుని విజ‌యం ద‌క్కించుకున్నా.. అది రాహుల్ ఇమేజ్ కింద‌కే వ‌స్తుంది త‌ప్ప‌.. మ‌రోమాటే వ్య‌క్తం కాదు. అలా కాకుండా.. వ్యూహ‌క‌ర్త‌గా రాహుల్‌ను వెనకుండి న‌డిపించ‌డం ద్వారా.. పీకే ఖ‌చ్చితంగా రాహుల్‌ను మించి ప్రొజెక్టు అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
మ‌రి ఈ విష‌యంలో పీకే ఆలోచించే ఉండ‌రు క‌దా?! అనేది స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్న ప్ర‌శ్న‌. మ‌రి ఆయ‌న వ్యూహం ఏంటో చూడాలి. ఏదేమైనా.. పీకే విష‌యంలో ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చిన ఈ చ‌ర్చ ఎటు దారి తీస్తుందో చూడాలి .. అంటున్నారు ప‌రిశీల‌కులు.