Begin typing your search above and press return to search.

మునుగోడు ఉప ఎన్నిక.. క్రికెట్‌ను మించి రూ.వేల కోట్ల బెట్టింగ్‌!

By:  Tupaki Desk   |   30 Oct 2022 6:30 AM GMT
మునుగోడు ఉప ఎన్నిక.. క్రికెట్‌ను మించి రూ.వేల కోట్ల బెట్టింగ్‌!
X
దేశస్థాయిలో ఆసక్తి రేపుతున్న ఉప ఎన్నిక.. మునుగోడు. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అధికార టీఆర్‌ఎస్‌ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున పార్టీ పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు.

కాగా కొద్దిరోజుల క్రితం నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగాయన్న వార్త హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల ఇవ్వచూపారన్న వార్త కలకలం సృష్టించింది.

ఈ నేపథ్యంలో మునుగోడులో ఎవరు గెలుస్తారనే అంశం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌లు సైతం అంతేస్థాయిలో జరుగుతున్నాయి.

నవంబర్‌ 3న జరగనున్న మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల తూటాలు, తీవ్ర విమర్శలతో ప్రజలు ఆ రెండు పార్టీలను వదిలేసి కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

తెలంగాణలోనే కాకుండా దేశంలోనే ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా దీన్ని భావిస్తున్నారు. దీంతో పందేలు సైతం అంతే స్థాయిలో నడుస్తున్నాయి.

ఓటర్లు, నేతలను ప్రలోభపెట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు వెచ్చిస్తున్నాయని చెబుతుండగా.. ఇప్పటికి రూ.1000 కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరిగినట్లు తెలిసింది.

స్థానికంగా ఉన్న పందెందారులే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం నుండి కూడా చాలా మంది బడా పందెందారులు హైదరాబాద్‌లో క్యాంప్‌లు వేశారని చెబుతున్నారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే మునుగోడు ఉప ఎన్నికపై భారీ స్థాయిలో బెట్టింగ్‌లు వేస్తున్నారు.

ఈ మూడు పార్టీలపైన అభ్యర్థులు పందేలు కాస్తుండటం గమనార్హం.
అయితే పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ గెలవగలిగే పార్టీపై బెట్టింగ్‌లు ఇంకా ఎక్కువ అవుతాయని అంటున్నారు.

ఆదివారం మునుగోడులో కేసీఆర్‌ బహిరంగ సభ ఉంది. అలాగే రాజగోపాల్‌ రెడ్డి గత రెండు రోజులుగా భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు.

సంఖ్యాపరంగా చూస్తే ఏ పార్టీ గెలిచినా మెజారిటీ తక్కువే ఉంటుందని చెబుతున్నారు. 15–20 వేలకు మించి మెజారిటీ ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తక్కువ మెజారిటీ ఏ అభ్యర్థి వైపు ఉంటుందో.. ఆ అభ్యర్థిపై పందెందారులకు లాభాలు కురిపిస్తుందని పేర్కొంటున్నారు.