Begin typing your search above and press return to search.

మే-ఆగస్ట్ మధ్య లక్షలాది వైట్ కాలర్స్ ఉద్యోగాలు పోయాయి

By:  Tupaki Desk   |   18 Sep 2020 1:30 AM GMT
మే-ఆగస్ట్ మధ్య లక్షలాది వైట్ కాలర్స్ ఉద్యోగాలు పోయాయి
X
కరోనా వైరస్ అన్ని రంగాలతో పాటు, అందరినీ దెబ్బకొట్టింది. ఈ మహమ్మారి కారణంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 23వ తేదీన లాక్ డౌన్ విధించింది. దీంతో ఏప్రిల్ నెలలో 12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గతంలో తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి తెరుచుకున్నందున ఉద్యోగాలు తిరిగి వస్తున్నాయి. ఓ సమయంలో 30 శాతం వరకు ఉన్న నిరుద్యోగిత రేటు, ఇప్పుడు పది శాతం దిగువకు వచ్చింది.

ఉద్యోగులు క్రమంగా కుదుటపడుతున్నప్పటికీ, మే నెల నుండి ఆగస్ట్ నెల మధ్య 66 లక్షల వైట్ కాలర్ ఉద్యోగాలు పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఇందులో సాఫ్టువేర్ ఇంజినీర్లు, ఫిజీషియన్లు, ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు సహా వివిధ రంగాలకు చెందినవారు ఉన్నారు. అలాగే, పారిశ్రామిక రంగాల్లో 50 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరు వృత్తిపరంగా ప్రయివేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నారు.

గత ఏడాది ఇదే కాలంలో (మే-ఆగస్ట్ 2019) 1.9 కోట్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ఉండగా, ఇప్పుడు 1.2 కోట్లకు తగ్గింది. 66 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలిపింది. 2016 తర్వాత గత ఏడాది ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నాలుగేళ్లలో వారు ఆర్జించినది అంతా ఈ మహమ్మారి కారణంగా తుడిచిపెట్టుకుపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. పరిశ్రమలో ఉద్యోగాలు కోల్పోయిన 26 శాతం మేర ఉద్యోగాలు కోల్పోయారని, ఈ గణాంకాలు కరోనా వల్ల పరిశ్రమపై ఎంత దెబ్బ పడిందో తెలుస్తోందని పేర్కొంది.