Begin typing your search above and press return to search.

రామ.. రామ.. ఈ తప్పులేంటి..?

By:  Tupaki Desk   |   10 April 2016 10:00 AM GMT
రామ.. రామ.. ఈ తప్పులేంటి..?
X
తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే శ్రీరామ కల్యాణోత్సవంలో భద్రాచల దేవస్థాన కమిటీ ప్రదర్శించిన నిర్లక్ష్యం అందరిని విస్మయానికి గురి చేయటమే కాదు.. విమర్శలు వెల్లువెత్తేలా చేస్తుంది. తెలుగు వారు ఎవరికైనా సరే.. శ్రీరామనవమి అన్న వెంటనే భద్రాద్రి గుర్తుకు రాక మానదు. తెలుగునేల మీద రామాలయాలు ఊరికి ఒకటి చొప్పున ఉన్నప్పటికీ.. భద్రాచల రామాలయంలో జరిగే శ్రీరామ నవమిని ఫాలో అవుతుంటారు. అంతటి పేరు ప్రఖ్యాతులున్న భద్రాచల రామ నవమి విషయంలో దేవస్థాన అధికారులు ఎంత జాగ్రత్తగా ఉండాలి?

కానీ.. తాజాగా ఆలయ అధికారులు రూపొందించిన కల్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను చూస్తే.. అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇట్టే అర్థమవుతుంది. దేవస్థానం రూపొందించిన ఆహ్వానపత్రికలోని 7వ పేజీలో శ్రీరామ మహా పట్టాభిషేక వైశిష్యంలో స్వామి వారి ఫట్టాభిషేకం తేదీని పొరపాటున ముద్రించారు. సంవత్సరాన్ని కూడా తప్పుగా ప్రచురించటం గమనార్హం.

గత ఏడాది నిర్వహించిన తేదీనే తాజా ఆహ్వానపత్రికలో కొనసాగించటంపై పలువురు భక్తులు మండిపడుతున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నవమి వేడుకలకు సంబంధించిన ఆహ్వానపత్రం తయారీ సందర్భంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. అంతేకాదు.. ఆహ్వాన పత్రిక చివరి పేజీలో ముద్రించిన రామాలయం ఫోటో కూడా 11 ఏళ్ల కిందటిది కావటం గమనార్హం. 2005 తర్వాత దేవాలయాన్ని కాస్త మార్పులు చేర్పులుచేశారు. ఇప్పుడున్న ఆలయ చిత్రాన్ని ముద్రించాల్సింది పోయి.. పాతది వేయటం ఏమిటన్న మాట వినిపిస్తోంది.

ఈ వ్యవహారం మీద సీమాంధ్రుల స్పందన కాస్త ఆసక్తికరంగా ఉంది. ఇదే తప్పు కానీ ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకొని ఉంటే.. తెలంగాణ ప్రాంతంలో ఉన్న గుళ్ల మీద సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి ప్రతిరూపంగా చూపించే వారని.. ఈ తరహా వాదనను తెరపైకి తీసుకొచ్చేవారని.. అలా విమర్శించే వారే.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు జరగటంపై ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. గత అనుభవాల్ని చూస్తే.. ఈ వాదనలోనూ సమంజసంగానే ఉందన్న భావన కలుగుతుంది. మరి.. మీరేమంటారు..?