Begin typing your search above and press return to search.

భ‌ద్రాచ‌లంలో 35 ఏళ్ల కింద‌ట ఓసారి.. మ‌ళ్లీ ఇప్పుడు డేంజ‌ర్!

By:  Tupaki Desk   |   15 July 2022 12:54 PM GMT
భ‌ద్రాచ‌లంలో 35 ఏళ్ల కింద‌ట ఓసారి.. మ‌ళ్లీ ఇప్పుడు డేంజ‌ర్!
X
ప‌విత్ర పుణ్యాధామం భద్రాచలంను వ‌ర‌ద గోదారి చుట్టేసింది. గోదావరి ఉగ్రరూపం దాల్చ‌డంతో భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణం చుట్టూ నీరు చేరింది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. ప‌ట్ట‌ణానికే వ‌చ్చే అన్ని దారులు మునిగిపోయాయి. దీంతో భ‌క్తులు, ప‌ర్యాట‌కులు ఎవ‌రూ రావ‌ద్ద‌ని అధికారులు హెచ్చ‌రించారు. భ‌ద్రాచ‌లం క‌ర‌క‌ట్ట ఎత్తు 80 అడుగులు కాగా ప్ర‌స్తుతం గోదావ‌రి నీటిమ‌ట్టం ప్ర‌స్తుతం 70 అడుగులు దాటిపోయింది. భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ప్ర‌స్తుతం ఏకంగా 25 లక్ష‌ల క్యూసెక్కులు ప్ర‌వాహం ఉంది. ఇది జూలై 15 శుక్ర‌వారం రాత్రికి 30 ల‌క్ష‌ల‌కు చేరుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. నీటిమ‌ట్టం 75 నుంచి 80 అడుగుల‌కు చేరుతుంద‌ని చెబుతున్నారు.

1986లో మాత్ర‌మే అంటే గ‌త 35 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి ప్ర‌వాహం వ‌చ్చింద‌ని అధికారులు చెబుతున్నారు. గోదావ‌రి నీటిమ‌ట్టాన్ని కొలిచే గోడ మునిగిపోవ‌డం గ‌మ‌నార్హం. దీన్ని బ‌ట్టి భ‌ద్రాచ‌లంలో వ‌ర‌ద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. గోదావ‌రి నుంచి భ‌ద్రాచ‌లం ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించే బ్రిడ్జిపైన ఇప్ప‌టికే రాక‌పోక‌ల‌ను నిలిపివేశారు. బ్రిడ్జిపైకి కూడా వ‌ర‌ద నీరు చేరే ప్ర‌మాదం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

మరింత వరద పెరిగితే కష్టమని అధికారులు అంటున్నారు. ఇప్పటికే రాముల‌వారి ఆలయం ముందుకు వరద నీరు వచ్చి చేరింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది. మిలటరీ హెలికాప్టర్లు కొత్తగూడెం చేరుకున్నాయి. మిలటరీ బోట్స్, 300 లైఫ్ జాకెట్లు, సహాయక చర్యలను కల్నల్ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. భద్రాచలంలో 48 గంటలపాటు ఆంక్షలు అమలులో ఉంటాయి.

62 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 2 వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కొత్త‌గూడెం భ‌ద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.

కాగా 1953లో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ 1986లో వరద బీభత్సం ఎదుర్కోవాల్సి వచ్చింద‌ని అధికారులు నాటి ప‌రిణామాల‌ను గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో ఏకంగా గోదావరికి ఏడు చోట్ల గండ్లు పడ్డాయ‌ని చెబుతున్నారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలోనే కాటన్ నిర్మించిన ఆనకట్ట గోదావరి ఉధృతికి కొట్టుకుపోయింది.

1990లో మరోసారి భారీ వరదలు వచ్చాయి. కానీ 2006 వరదల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కోనసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. తూర్పు గోదావ‌రి జిల్లా (ప్ర‌స్తుతం కోన‌సీమ జిల్లా)లోని వందల గ్రామాలు జలమయమయ్యాయి. ప‌శువులు మృత్యువాత ప‌డ్డాయి. వేలమంది ఇళ్లు, ఊళ్లూ ఖాళీ చేయాల్సి వచ్చింది.

వరదల్లో, ఎక్కువ నష్టం 1986లో సంభవించినట్టు ఇరిగేషన్ రికార్డులు చెబుతున్నాయి. ఆ వరదల్లో ఏకంగా ఏడు ప్రాంతాల్లో గోదావరికి ఇరువైపులా గండ్లు పడ్డాయి. దానికి కారణంగా ఉభయ గోదావరి జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పి.గన్నవరం వంటి చోట్ల ఆక్విడక్ట్ మీద నుంచి ప్రవాహం వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ధవళేశ్వరంలో కాటన్ ఆనకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా కొట్టుకుపోయింది. అపార నష్టం జరిగింది. నాటి ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ప్రధాని రాజీవ్ గాంధీ కూడా వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరదల్లో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత నష్టం గోదావరి వరదల్లో ఎన్నడూ లేద‌ని నాటి ప‌రిణామాల‌ను ఇప్పటి వ‌ర‌ద‌ను చూసి ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నారు.