Begin typing your search above and press return to search.

రాములోరి గుడిలో సీతమ్మ పుస్తె పోయిందా?

By:  Tupaki Desk   |   22 Aug 2016 8:19 AM GMT
రాములోరి గుడిలో సీతమ్మ పుస్తె పోయిందా?
X
సంచలనంగా మారిన భద్రాద్రి ఆలయంలోని ఆభరణాల మిస్సింగ్ నిజమేనన్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాములోరి గుడిలో ఆభరణాలు పోయాయంటూ గడిచిన మూడురోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. అందులో నిజానిజాలపై దేవాలయ అధికారులు క్లారిటీ ఇవ్వకపోవటంతో ఈ వ్యవహారంపై సందేహాలతో కూడిన వార్తలు వస్తున్నాయి. మీడియాలో పెరిగిన వార్తల జోరుతో.. ఆలయ ఈవో స్పందించారు.

స్వామివారి ఆభరణాల లెక్కల్ని చూసి.. తనకు నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో.. ఆలయ ఈవో ప్రత్యేక అనుమతితో గుడిని మూసేసిన ఆర్చక బృందం ఆభరణాల లెక్కను క్రాస్ చెక్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తం ఆభరణాల లెక్కలో రెండు ఆభరణాల లెక్క తేలలేదని ఈవోకు ఆర్చకులు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈవో చెబుతున్న మాటలు చూస్తే..ప్రతిరోజు జరిపే నిత్య కల్యాణం సందర్భంగా సీతమ్మవారి మంగళసూత్రం.. లక్ష్మణస్వామికి కల్యాణ సమయంలో సమర్పించే బంగారు లాకెట్ మిస్ అయిందని వెల్లడించారు. అయితే.. కీలకమైన విషయం ఏమిటంటే.. గుడిలోని ఆభరణాలు పోయినట్లుగా ఆయన చెప్పటం లేదు. కనిపించటం లేదని మాత్రమే చెప్పటం గమనార్హం. ఆభరణాలు మరెక్కడైనా పెట్టారా? ఉత్సవ మూర్తులకు సమర్పించే వస్త్రాల్లో ఏమైనా ఆభరణాలు ఉండిపోయాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మీడియాలో మాత్రం రాములోరి గుడిలో ఆభరణాలు పోయినట్లుగా వార్తలు వస్తుంటే.. ఆర్చకులు.. అధికారులు మాత్రం మరింత జాగ్రత్తగా సరి చూసుకోవాలని చెప్పటం గమనార్హం. ఆలయ ఈవో అధికారిక ప్రకటన వెలువడితే తప్ప గుడిలో నగలు పోయినట్లుగా ధ్రువీకరించే అవకాశం లేదు. దీనికి తగ్గట్లే ఆలయ ఈవో మాట్లాడుతూ.. ఆభరణాలు ఉండాల్సిన చోటు లేవని మాత్రమే చెబుతున్నారు తప్పించి.. పోయినట్లుగా తేల్చకపోవటం గమనార్హం.