Begin typing your search above and press return to search.
ఆ ఎంపీతో ‘సామాన్యుడి’ పరువు పోయింది
By: Tupaki Desk | 28 Oct 2015 4:38 AM GMTఆదర్శాలు వల్లె వేసే సామాన్యుడి పార్టీకి తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం కొత్త తలనొప్పిని తీసుకొచ్చింది. పార్టీకి చెందిన ఒక ఎంపీ వ్యవహారశైలి ఆపార్టీ తీరుపై వేలెత్తి చూపేలా చేయటమే కాదు.. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతల తీరుతో కిందామీదా పడుతున్న ఆమ్ ఆద్మీ మరింత ఇరుకున పడింది.
పంజాబ్ లోని సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాస్ ఒక మతపరమైన కార్యక్రమానికి మద్యం సేవించి వెళ్లటం.. ఇది గమనించిన వారు ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని చెప్పటం..ఆయన వెళ్లిపోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంపీ వైఖరిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎంపీ.. మత సంబంధమైన కార్యక్రమానికి మద్యం సేవించి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలతో పంజాబ్ అట్టుడికిపోవటం తెలిసిందే.
గురుగ్రంద్ సాహిబ్ గ్రంధంలోని వంద పేజీలను దుండగులు ఎవరో చించివేసిన ఘటన పంజాబ్ లో ఉద్రిక్తతలకు దారి తీరిసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకోవటం.. వీటిని అదుపు చేసే పనిలో పోలీసులు కాల్పులకు తెర తీయటంతో ఇద్దరు మరణించారు. ఇది పంజాబీయులను మరింత రగిలిపోయేలా చేసింది. పోలీసుల కాల్పుల్లో మరణించిన మరణించిన వారి స్మృత్యర్థం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఎంపీ బగవంత్ మాస్ ను పిలిచారు.
అయితే.. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయన మద్యం సేవించి రావటం.. అది గమనించిన మత పెద్దలు ఆయన్ను వెళ్లిపోవాల్సిందిగా చెప్పటంతో ఆయన మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎంపీ మద్యం సేవించి వచ్చిన విషయాన్ని గుర్తించిన అమృత్ సర్ దర్బార్ సాహిబ్ కు చెందిన మత పెద్ద జగ్ జిత్ సింగ్.. ఆయన్ను వేదిక మీద నుంచి వెళ్లిపోవాలన్నారు. తానీ విషయాన్ని బహిరంగంగా చెప్పి ఉంటే ఎంపీ తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కునే వారని వ్యాఖ్యానించటం ద్వారా ఆమ్ ఆద్మీకి చెందిన ఎంపీ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీలో చోటు చేసుకున్న ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా.. మత సంబంధమైన కార్యక్రమానికి వెళ్లేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్న విషయం కూడా తెలీని వ్యక్తి ఎంపీ ఎలా అయ్యారో..? ఎంపీ వైఖరితో పార్టీ పరువు బజారున పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వాపోతున్నారు.