Begin typing your search above and press return to search.

తెలంగాణలో మరో ఎలక్షన్ పక్కా

By:  Tupaki Desk   |   5 Jan 2016 6:43 AM GMT
తెలంగాణలో మరో ఎలక్షన్ పక్కా
X
తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరగాల్సిన పరిస్థితులు వచ్చాయి.. ఎన్నికల కమిషన్ కూడా ఈ సంగతి చెప్పేసింది. స్పీకర్ ప్రకటించడమే తరువాయని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ క్లారిటీ ఇచ్చేశారు. హైదరాబాద్ శివారుల్లో ఉండి మెదక్ జిల్లా పరిధిలోకి వస్తున్న పటాన్ చెర్వు నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానం ఖాళీగా ఉన్నట్లేనని ఆయన చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో పటాన్ చెర్వు నుంచి గెలిచిన మహిపాల్ రెడ్డికి ఓ కేసులో రెండున్నరేళ్ల శిక్ష పడింది. దీంతో చట్టసభలో ఆయన సభ్యత్వం రద్ధయినట్లేనని చెప్పారు. అయితే స్పీకరు నోటిఫై చేసి పటాన్ చెర్వు నియోజకవర్గాన్ని ఖాళీగా చూపాల్సి ఉందని ఆయన చెబుతున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరైనా చట్టసభల సభ్యులకు జైలు శిక్ష పడితే వారి సభ్యత్వం రద్దయినట్లే. ఆ లెక్కన రెండున్నరేళ్ల శిక్ష పడిన మహిపాల్ ఇక ఎమ్మెల్యే కాదు. దాంతో పటాన్ చెర్వు స్థానం ఖాళీ అయింది. ఇది ఖాళీగా ఉందని స్పీకరు నోటిఫై చేస్తే ఉప ఎన్నిక నిర్వహిస్తారు. కాగా మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండడంతో దాంతో పాటే పటాన్ చెర్వు కు కూడా ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.

కాగా తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా వరుస విజయాలతో దూసుకెళ్తున్న తెరాసకు ఈ ఉప ఎన్నికల వల్ల వచ్చే ముప్పేమీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు స్థానాలను గెలుచుకుని తెరాస మరోసారి తన పట్టు నిరూపించుకుంటుందని చెప్తున్నారు.